లంచమడిగితే తిరగబడండి
(సాక్షిప్రతినిధి, అనంతపురం) : ‘ రెవెన్యూ శాఖలో 50 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వీటిని గణనీయంగా తగ్గిస్తాం. ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండా సెల్‌ఫోన్‌ల ద్వారానే పనులయ్యేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. పలుశాఖల్లో తప్పులు జరిగాయి. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరైనా డబ్బులడిగితే మీరు తిరగబడండి. అండగా నేనుంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరగలేదని ఓవైపు ప్రసంగించిన చంద్రబాబు.. మరోవైపు అధికారుల అవినీతిపై వ్యాఖ్యలు చేసి పరోక్షంగా అవినీతి ఉందంటూ అంగీకరించారు.
శనివారం ఆయన ధర్మవరంలో చేనేతల రుణవిముక్తిసభ, బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతకుముందు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ధర్మవరానికి చేరుకున్నారు. రైల్వేఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొక్కలు నాటి నేరుగా సభాస్థలికి చేరుకున్నారు. చేనేత పరిశ్రమపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వరదాపురం సూరి అధ్యక్షతన జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఇలా సాగింది..
పంట కుంటలపై శ్రద్ధ తీసుకోవాలి
‘నదులు అనుసంధానం చేశా. కాలువలు పూర్తి చేశా. పంటకుంటలకు డబ్బు, రెయిన్‌గన్‌లు ఇచ్చా. మీరు మాత్రం కుంటలు తవ్వలేదు. వర్షం రావడంతో తర్వాత చుద్దామని వదిలేశారు. వర్షం వచ్చినప్పుడు కుంటలు తవ్వి నీరునిల్వ చేసుకోవాలి. జూన్‌లో 8, డిసెంబర్‌లో 3 మీటర్లలో భూగర్భజలమట్టం ఉండాలి. కానీ ఇప్పుడు 17.6 మీటర్లలో ఉంది. భూగర్భజలాల పెంపుపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. అనంతపురం పండ్లు మంచిరుచిగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. జిల్లాను హార్టికల్చర్‌హబ్‌గా మరుస్తాం. వేరుశనగకు కూడా అభివృద్ధి చేస్తాం.
అమెరికాలో పీనట్స్‌గా వేరుశనగ విత్తనాలను విక్రయిస్తారు. భూసార ‡పరీక్షలు చేసి విత్తనాల నాణ్యతను పెంచుతాం. ప్రపంచంలోనే క్వాలిటీగా చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం. అప్పుడు మెరుగైన ధరలు వస్తాయి. బెంగళూరు పక్కనే ఉంది. కావున అంతర్జాతీయ పరిశ్రమలు జిల్లాకు వస్తాయి. ఇప్పుడు బెంగళూరుకు ఉద్యోగాల కోసం వెళుతున్నారు. భవిష్యత్తులో అక్కడి నుంచే ఇక్కడికొస్తారు. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి. ఈ ప్రభుత్వంలో వాటి ఆటలు సాగవు. ఒకప్పుడు బియ్యం ఇవ్వమంటే మధ్యలోనే అమ్మేసుకునేవారు. ఈరోజు ఈ పాస్–ద్వారా అవినీతి జరగకుండా అందరికీ ఇస్తున్నాం.’
రీలింగ్ కాంప్లెక్స్‌కు 30 ఎకరాలు
‘అనంతలో 35 వేల ఎకరాల్లో మల్బరీ ఉంది. జిల్లాలో వెయ్యి రేషం షెడ్లు మంజూరు చేశాం. ఇప్పుడు ఒక్కో షెడ్డుకు రూ.82,500 ఇస్తున్నాం. అదనంగా ఒక్కోషెడ్డుకు రూ.1.10 లక్షల చొప్పున వెయ్యిషెడ్లకు రూ.11 కోట్లు మంజూరు చేస్తున్నా. అలాగే రీలింగ్ కాంప్లెక్స్‌ల కోసం రూ.20 కోట్లు ఇస్తున్నా. ధర్మవరంలో 10, హిందూపురంలో 20 ఎకరాలు తీసుకుని రీలింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం. ముడిపట్టు ధర పెరిగింది. కిలో రూ.150 ఉండేది. ఇప్పుడు రూ.250కి పెరిగింది. దీని సబ్సిడీ కోసం రూ.42 కోట్లు విడుదల చేస్తున్నా.’
ధర్మవరం ఆస్పత్రిలో సిబ్బంది పెంపు
ధర్మవరంలో వందపడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ధర్మవరం, బుక్కరాయసముద్రంలో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు సమ్మతించారు. ధర్మవరం పరిధిలోని గొల్లపల్లి– పోట్లమర్రి బీటీరోడ్డుకు రూ.21కోట్లు, మరో ఆరు బీటీరోడ్లకు రూ.7కోట్లు, ధర్మవరాన్ని స్మార్ట్‌సిటీగా చేసేందుకు రూ.25కోట్లు కేటాయించారు. నార్పలలో 30 పడకల ఆస్పత్రికి అంగీకారం తెలిపారు. శింగనమల నియోజకవర్గంలో పలు బీటీరోడ్లకు నిధులు మంజూరు చేశారు.
పర్యటనలో మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎంపీలు జేసీదివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, మెట్టు గోవిందరెడ్డి, Ô¶ మంతకమణి, గేయానంద్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, సెరికల్చర్ జేడీ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వేదికపై కందికుంట
ధర్మవరం స¿¶ వేదికపై మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆశీనులయ్యారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే వేదికపై ఉండాలి. అందుకు విరుద్ధంగా కందికుంట కూర్చొన్నప్పటికీ ఏఒక్కరూ అడ్డుచెప్పలేదు. దీంతో ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేకæ టీడీపీ సభనా అని చర్చించుకున్నారు.