కరువు రహిత జిల్లాగా ‘అనంత’ ! | cm speech in mukthapuram meeting | Sakshi
Sakshi News home page

కరువు రహిత జిల్లాగా ‘అనంత’ !

Published Wed, Jul 5 2017 11:13 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

కరువు రహిత జిల్లాగా ‘అనంత’ ! - Sakshi

కరువు రహిత జిల్లాగా ‘అనంత’ !

– రామగిరిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ నిర్మాణానికి నిధులు
– ‘అనంత’ను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తా..మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా
– ముక్తాపురంలో ఎన్‌టీఆర్‌ కాలనీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
– రైతు కృతజ్ఞత యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు


సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ను కరువు రహిత జిల్లాగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతను హార్టికల్చర్‌హబ్‌గా మారుస్తానన్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబు బుధవారం ‘అనంత’ పర్యటనకు వచ్చారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుండి హెలికాప్టర్‌లో ముక్తాపురం చేరుకున్నారు.

అక్కడ ఎన్టీఆర్‌ గృహకల్ప కింద నిర్మించిన ఎన్టీఆర్‌ కాలనీని ప్రారంభించారు. అక్కడే లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఇళ్లు చాలా బాగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే తనకు కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. అక్కడి నుంచి బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతపురం ఎడారిగా మారిపోయే ప్రమాదముందని, ఇప్పటికే రాయదుర్గంలో ఎడారి ఛాయలు కన్పిస్తున్నాయన్నారు. అయితే దీన్ని ఎడారిగా మారిపోకుండా కాపాడుతానన్నారు. హంద్రీ–నీవా ద్వారా జిల్లాలోని చెరువులకు నీళ్లిస్తానన్నారు. పేరూరు–బీటీపీకి కూడా నీళ్లిస్తామన్నారు. 2–3నెలల్లో మడకశిర బ్రాంచ్‌కెనాల్‌ ద్వారా హిందూపురం, మడకశిరకు నీళ్లిస్తామన్నారు.

        రామగిరిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీపై గతంలో ప్రకటన చేశానని, కాలేజీ భవాల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ధర్మవరం వరకూ 11.5కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అలాగే అనంతపురం నుంచి ఎగువల్లి, అనంతపురం బైపాస్‌ నుంచి చిగురుచెట్టు మీదుగా కనగానపల్లి వరకూ రోడ్డు, ఆత్మకూరు–పేరూరు, పేరూరు– ఎర్రబెంచి, కోడూరు– ఒంటికొండకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతపురం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో అనంతపురానికి పరిశ్రమలు అధికంగా వస్తున్నాయన్నారు. పెనుకొండ వద్ద ఏర్పాటవుతోన్న కియా కార్లపరిశ్రమ నుంచి 2019 ఎన్నికల కంటే ముందుగానే ఉత్పత్తి ప్రారంభమై కార్లు బయటకు వస్తాయన్నారు.

అనంతపురానికి రూ. 1034కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చామని, రూ.419కోట్లు ఇన్సూరెన్స్‌ కూడా ఇస్తున్నామన్నారు. రుణమాఫీ చేసినా, ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చినా కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. తనపై కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నారు. సభ అనంతరం పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్‌లు పంపిణీ చేశారు. డ్రిప్‌ పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బీకే పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్‌ చమన్, మేయర్‌ స్వరూప, కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఐజీ, ఎస్పీ శుభాకాంక్షలు : రాయలసీమ ఐజీగా బాధ్యతలు తీసుకున్న ఇక్బాల్‌, ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జీవీజీ అశోక్‌కుమార్‌ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం  అందించారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నామని పరిచయం చేసుకున్నారు.

నిరాశపరిచిన సీఎం పర్యటన
కనగానపల్లి (రాప్తాడు) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనపై ఎన్నో ఆశలతో వచ్చిన అన్నదాతలకు చివరికి నిరాశే మిగిలింది. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై రైతు కృతజ్ఞత సభలో ఇప్పటికైనా విడతల వారీగా కాకుండా పూర్తిగా మాఫీ చేస్తారని, ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పటికి రెండు విడతలు మాఫీ చేసిన జిల్లాలో ఇక్క రెండవ విడతలో సగం మంది రైతులకు రుణమాఫీ వర్తించనే లేదు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు నియోజక వర్గం కనగానపల్లి మండలానికి విచ్చేశారు. ముక్తాపురం గ్రామంలో ఎన్‌టీఆర్‌ గృహాలు ప్రారంభం, అనంతరం రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రుణమాఫీ చేశానని అనడంతో మాకు రుణమాఫీ ఇంక జరగలేదని రైతులు ఆయన ప్రసంగం మధ్యలోనే రైతులు వెనుతిరిగి పోయారు. అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ, సీఐలు గోరంట్ల మాధవ్, సూర్యనారాయణ, ఎస్‌లు, పోలీసులు ఎంత చెప్పినా మహిళలు వినకుండా బయటకు వెళ్లిపోయారు.



అందరికీ గూడు ప్రభుత్వ లక్ష్యం : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికి గూడు కల్పించటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ముక్తాపురంలో బుధవారం ఆయన మోడల్‌ హౌసింగ్‌ కాలనీ ప్రారంభించారు. ఎన్టీఆర్‌ సృగృహ పథకం కింద ఇక్కడ 33 ఇళ్లను నిర్మించి, ప్రజలకు అవసరమైన మౌళిక వసతులను కల్పించి మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దారు.  కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీతతో పాటు, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కాలువ శ్రీనివాసులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కాలనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీలో కొత్తగా నిర్మించుకున్న పలు గృహాలను సీఎం ప్రారంభించి, నిర్మాణాలను క్షుణంగా పరిశీలించారు. తర్వాత కాలనీ పక్కన నీరు– చెట్టు పథకం కోసం ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్, హౌసింగ్‌ పీడీ రాజశేఖర్, డీఈ మహబూబ్‌సాహెబ్, స్థానిక టీడీపీ నాయకులు ఎల్‌.నారాయణచౌదరి, నెట్టం వెంకటేష్, రామ్మూర్తీనాయుడు, ముకుందనాయుడు, సర్పంచ్‌లు సూర్యశేఖరరెడ్డి, రామసుబ్బయ్య, ముకుంద, నాయకులు రాజప్ప, సుబ్రమణ్యం, రాము, పలు శాఖల అధికారులు, హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement