అంతా ఆర్భాటమే
-పంటను కాపాడతామంటూ హడావుడి చేస్తున్న సీఎం
- మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లాకు చేరిక
- రెండు పొలాల్లో ఫొటోలకు ఫోజులు.. ప్రతీ ఎకరాకు నీరిస్తామని ప్రకటన
-ముఖ్యమంత్రి ఆర్భాటంపై అధికార వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత
- అదను దాటిపోయినందున ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాలంటున్న రైతులు
అనంతపురం: రక్షకతడితో పంటను కాపాడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారని ప్రజలు, రైతులు విమర్శిస్తున్నారు. సీఎం ఇంతకుముందు నెలలో మూడుసార్లు జిల్లా పర్యటనకు వచ్చినా వేరుశనగ పంట పరిస్థితి గురించి ఆరా తీయలేదు. ఈ నెల 12 నుంచి 24 వరకూ కృష్ణా పుష్కరాల్లో మునిగితేలుతూ ‘అనంత’లో ఎండిన పంటను నిర్లక్ష్యం చేశారు. ఈలోగా జిల్లాలో 5.41 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. దీన్ని కాపాడతానని ప్రకటించి విఫలమయ్యారు. అయితే.. ఆ నిందను మంత్రులు, అధికారులపైకి నెట్టేస్తున్నారు. పంట ఎండిన సమాచారం తనకు తెలీదనే కారణంతో తప్పించుకోవాలని చూస్తున్నారు.
దీనిపై ప్రతిపక్షాలు, రైతుసంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా పంట కాపాడేందుకు తాను తపన పడ్డానని, తీవ్రంగా శ్రమించాననే భావన ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు మరోసారి ‘అనంత’కు వచ్చా రు. పంట ఎండటాన్ని విపత్తుగా తీసుకున్నాని, అందుకే ఇక్కడే ఉండి కాపాడతానని ప్రకటించారు. ఆదివారం అమడగూరు, కదిరి నియోజకవర్గాల్లో పంటలను పరిశీలించారు. పంటలను కాపాడేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఇంతలోనే మంగళవారం మరోసారి జిల్లా పర్యటనకు వచ్చారు. సాయంత్రం 6గంటలకు పెనుకొండ నియోజకవర్గం రొద్ద మండలం పెద్దమంతూరు చేరుకున్నారు.
అక్కడ వెంకమ్మ అనే రైతు వేరుశనగ పొలాన్ని, పరిగి మండలంలో గణపతిపురం అనే గ్రామంలో భాస్కర్ అనే మరో రైతు పొలాన్ని పరిశీలించారు. ఈ రెండు పొలాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు రెయిన్‌గన్లతో నీరు ఇవ్వలేదు. మంత్రులు వచ్చినపుడు ఫొటోలకు పోజు లిచ్చేందుకు కాసేపు నీళ్లు వదలడం... తర్వాత ఆపేయడం చేశారు. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా రెయిన్‌గన్లను ఆపేసి సీఎం రాగానే ఆన్ చేశారు. వాటిని చూసి సీఎం రెయిన్‌గన్లతో రైతుల పంటలు కాపాడుతున్నామని ప్రకటిస్తున్నారు.
ఇవి చూసి సీఎం చుట్టూ ఉన్న పలువురు అధికారులతో పాటు రైతులు నవ్వుకుంటున్నారు. పంటను కాపాడలనే చిత్తశుద్ధి ఉంటే ఉదయం నుంచి రైతులకు ఎందుకు రెయిన్‌గన్ల ద్వారా నీరివ్వలేదని, కేవలం సీఎం ముందు 5 నిమిషాలు సినీఫక్కీలో రెయిన్‌గన్లు ఆడించడంపై మండిపడుతున్నారు. పంట కాపాడటమంటే ఇంట్లో భోజనం వండినంత సులువు కాదని, అదనులో నీళ్లివ్వడం చేయాలన్నారు. గతేడాది హంద్రీ–నీవా పనులను పూర్తి చేసి ప్రధాన కాలువ నుంచి ఉప, పిల్లకాలువను ఏర్పాటు చేసి ఉంటే ఈ ఏడాది ఈ పరిస్థితి తలెత్తేది కాదని చర్చించుకున్నారు.
పంట ఎండిన సంగతి తెలీదన్నసంగతిపై జోరుగా చర్చ
పంట ఎండిన సంగతి తనకు మంత్రులు, అధికారులు చెప్పలేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చసాగింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అధికారులు, రైతులతో పాటు మీడియా ప్రతినిధులు ఈ వ్యాఖ్యలపై చర్చించారు. నెలరోజులుగా పంట ఎండిపోతుంటే వ్యవసాయశాఖ మంత్రికి తెలీదా? జిల్లా మంత్రులు చెప్పలేదా? సకాలంలో పంట కాపాడలేకపోవడానికి ఇదే కారణమైతే మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చర్చించుకున్నారు.
అలాగే రెవెన్యూ, వ్యవసాయశాఖల నుంచి నెలరోజులుగా సమాచారం ప్రభుత్వానికి చేరలేదంటే చంద్రబాబు పాలనలో అధికార వ్యవస్థ ఎలా నడుస్తోందో ఇట్టే తెలుస్తోందని రుసరుసలాడారు. సకాలంలో పంటకు నీళ్లివ్వడంలో నిర్లిప్తత ప్రదర్శించి పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి కాపాడతామనే ఆర్భాటం చేయడం ఎంత వరకు సమంజసమని, పంటను ప్రభుత్వం కాపాడిందనే సాకును చూపుతూ ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకే ఈ పర్యటనలు చేస్తున్నారని పరిశీలకులు మండిపడుతున్నారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కలెక్టర్ శశిధర్, జేసీ లక్ష్మీకాంతం, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.