పకోడిలో బొద్దింక
-
ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు
-
దేశాయిపేట రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో ఘటన
-
తనిఖీలు మరచిన అధికారులు
పోచమ్మమైదాన్ : మేడి పండు చూడు మేలిమై ఉండు. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్నట్లుగా ఉంది బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే తినుబండారాల పరిస్థితి. నాణ్యతలేని ఆహారlపదార్థాలు, పురుగులతో కూడిన తినుబండారాలు విక్రయిస్తూ వినియోగదారుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు హోటళ్ల యాజామాన్యాలు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆదివారం పకోడిలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన రాజు తన మిత్రులతో కలిసి ఆదివారం శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉల్లి పకోడిని ఆర్డర్ ఇవ్వగా, బేరర్ తెచ్చి టేబుల్‌పై పెట్టాడు. పకోడి మధ్యలో చూడగా బొద్దింక కనిపించింది. విషయాన్ని బార్ యాజమాన్యానికి చెప్పగా వారు పట్టించుకోలేదు. పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజు వెంటనే ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి జ్యోతిర్మయికి ఫోన్‌లో సమాచారం అందించి, వాట్సప్‌లో ఫొటో పంపారు.
ఫిర్యాదు చేసినా తనిఖీలు శూన్యం..
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలలో పలు హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు, తినుబండారాల్లో పురుగులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో తనిఖీ చేసిన సంఘటనలు ఎక్కడా కానరావడం లేదు. నెలవారీ మామూళ్లకు కక్కుత్తి పడి తనిఖీలకు వెనకాడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయమై శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ తమ రెస్టారెంట్‌లో పకోడిలో బొద్దింక వచ్చిన సంఘటన ఏమీ జరగలేదని తెలిపారు.