పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగనీయం
పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగనీయం
Published Thu, Jul 27 2017 11:47 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
పక్కా ప్రణాళికతో ఆర్‌ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలు
కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడి
పోలవరం ప్రాజెక్ట్ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం
రంపచోడవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలులో అన్యాయం జరగకుండా పక్కా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్లో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్త భూసేకరణ చట్టం, ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ అందిస్తామన్నారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని 234 ఆవాసాలలో ప్యాకేజీని అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 1204 కుటుంబాలకు ప్యాకేజీ మంజూరు చేసి, పునరావాస కాలనీలకు తరలించామని తెలిపారు. మరో 6,215 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో గిరిజనులు ఎంత భూమిని కోల్పోయినప్పటికీ, భూమికి భూమి పథకం కింద రెండున్నర ఎకరాలను మాత్రమే ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. గిరిజనేతరులకు మాత్రం మొత్తం భూమికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీగా గిరిజనులకు రూ. రూ.7.11 లక్షలు, గిరిజనేతరులకు రూ.6.61 లక్షల చొప్పున అందుతుందన్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో పునరావాస కాలనీలను నిర్మిస్తామని చెప్పారు.
కటాఫ్ తేదీలను సడలించాలి
సమావేశంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ అమలులో పెట్టిన కటాఫ్ తేదీలను సడలించాలని కోరారు. లేని పక్షంలో చాలా మంది నష్టపోతారని ఆమె అన్నారు. పీసా గ్రామసభ తేదీలు ఎప్పుడో తెలియక చాలామంది నిర్వాసితులు సామాజిక, ఆర్థిక సర్వేకు హాజరు కాలేకపోయారన్నారు. మూడు రోజుల మందుగా గ్రామాల్లో టాం, టాం వేసి గ్రామసభలకు అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ గ్రామసభలో తమ ప్రాంత వాసులు ఎక్కడ చదువుతున్నారో తెలిపి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ 22 ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.గిరిజనేతరుల ఇంటి స్థలాల కోసం కృష్ణునిపాలెంలో 108 ఎకరాలను గుర్తించామన్నారు. కొత్త చట్టం ప్రకారం కటాఫ్ డేట్ మార్చి 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వడం సాధ్యపడదన్నారు. కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ, కమిటీ సభ్యురాలు కొమరం ఫణిశ్వరమ్మ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్యాకేజీ అమలుపై రూపొందించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే, పీవోలు ఆవిష్కరించారు. సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో జి. చినబాబు, స్పెషల్ కలెక్టర్ భానుప్రకాష్, ఎస్‌డీసీ ఎల్లారమ్మ, మురళీమోహనరావు, ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
Advertisement