జిల్లాలో గృహనిర్మాణ సంస్థ అధికారులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు.
అనంతపురం టౌన్ : జిల్లాలో గృహనిర్మాణ సంస్థ అధికారులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పనితీరు ఆధారంగా వీరందరికీ 'సీ' గ్రేడ్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలోనే గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రేడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో జిల్లాలో ఇందిరా ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అప్‌గ్రెడేషన్ తదితర పథకాల్లో పురోగతి అధ్వాన్నంగా ఉండడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 8 మంది డీఈఈలు, 37 మంది ఏఈలకు షోకాజులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వీరందరిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ నోటీసులిచ్చారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల్లో అనంతపురం జిల్లా 5వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.