ఆదేశాలు రాలేదంటే అరెస్ట్ చేయిస్తా
పెళ్లిళ్లకు రూ.2.50 లక్షల నగదు ఇవ్వాల్సిందే
నా సిఫార్సు అవసరం లేదు
బ్యాంక్ మేనేజర్‌పై కలెక్టర్ ఆగ్రహం
ఏలూరు (మెట్రో) : వివాహాలకు అవసరమైన డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఎవరికైతే పెళ్లి కోసం డబ్బు కావాలో శుభలేఖను పరిశీలించి, బ్యాంకు మేనేజర్ రూ.2.5 లక్షలు బ్యాంక్ ఖాతా నుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని, ప్రతి విషయానికి కలెక్టర్ సంతకం కావాలని కలెక్టర్ వద్దకు పంపించవద్దని కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన రావూరి నాగ వెంకటసత్యనారాయణ తన కుమార్తె నాగలక్ష్మి వివాహం డిసెంబర్ 8న నిర్వహించనున్నామని, పెళ్లి ఖర్చుల కోసం బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు వెళితే తమకు అనుమతి లేదని చెబుతున్నారని, కలెక్టర్, ఎస్పీలతో సంతకం చేయిస్తే బ్యాంక్ మేనేజర్ డబ్బులిస్తామని చెబుతున్నారని కలెక్టర్ ధృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లిళ్లకు డబ్బు డ్రా చేసుకోవాలన్నా తన సంతకం కావాలనడం ఎంత వరకూ సమంజసమన్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉన్నా మేనేజర్లు సమస్య పక్కదారి పట్టిస్తున్నారని, తక్షణమే బ్యాంక్ మేనేజర్‌ను పిలిపించారు. బ్యాంకు మేనేజర్ శరవణ్ రాగానే పెళ్లికి కావాల్సిన డబ్బు డ్రా చేసుకునేందుకు తన సంతకం దేనికని కలెక్టర్ ప్రశ్నించారు. తమకు ఇంకా రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు రాలేదని మేనేజర్ సమాధానం చెప్పడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి డబ్బు డ్రా చేసి ఇచ్చేందుకు ఏమైందని కలెక్టర్ ప్రశ్నించారు. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆదేశాలు రానందున తానేమీ చేయలేనని శరవణ్ చెప్పడంతో రిజర్వు బ్యాంకు ఆదేశాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని వాటిని చూసి తక్షణమే ఖాతాదారునికి డబ్బు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. అయినప్పటికీ మేనేజర్ వినకపోవడంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. దీంతో స్పందించిన బ్యాంకు మేనేజర్ ఉన్నతాధికారులతో మాట్లాడి నగదు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది. జిల్లాలో ఏ ఒక్క పెళ్లి కూడా డబ్బుల్లేకుండా నిలిచిపోకూడదని, రిజర్వు బ్యాంకు విధానాలను అన్ని బ్యాంకులు పాటించాలని ఆదేశించారు.