– పలు లే అవుట్ల తొలగింపు
– అధికార పార్టీ నాయకులకు షాక్
సాక్షి ఎఫెక్ట్
కదిరి : కదిరి మున్సిపల్ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేసిన అక్రమ లే అవుట్లన్నింటినీ అధికారులు తొలగించారు. గురువారం స్థానిక రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది అక్కడకు వెళ్లి జేసీబీ సాయంతో అక్రమ లే అవుట్లలో నాటిన రాళ్లను తొలగించారు. తాత్కాలికంగా వేసిన రోడ్లను జేసీబీతో దున్నేశారు. ఈ పరిణామం టీడీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. భవిష్యత్‌లో ఎవరైనా అనుమతి లేకుండా మళ్లీ లే అవుట్లు వేస్తే ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు హెచ్చరించారు.
వివరాలు..ఇటీవల ‘రియల్’ మోసాలు’ శీర్షికన సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించిన కథనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. కదిరిలో టీడీపీకి చెందిన 28వ వార్డు కౌన్సిలర్ దాసానపు శంకర్‌తో పాటు మరికొందరు కలిసి సున్నపుగుట్ట తండాకు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో వేసిన అక్రమ లే అవుట్ల విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్ వెంటనే స్పందించి కౌన్సిలర్‌తో పాటు మిగిలిన సభ్యులందరికీ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి సమాధానం రాకపోగా, ఆ కౌన్సిలర్ కౌన్సిల్‌లో దీనిపై దుమారం లేపారు.
‘నేను ఒక్కడే కాదు..కదిరి మున్సిపల్ పరిధిలో ఇంకా చాలామంది మా పార్టీకే చెందిన నాయకులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని, వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సహకారంతో వెళ్లి అక్రమ లే అవుట్లన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. దీంతో మూడు శాఖల అధికారులు ఏకమై కదిరి–హిందూపురం రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ లే అవుట్లన్నింటినీ తొలగించారు. శుక్రవారం కదిరి–మదనపల్లి రోడ్డుకు ఉన్న వాటిని తొలగించనున్నారు. కాగా తమ ఆదాయానికి గండి కొడుతున్న మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, టీపీఎస్ వినయ్‌ప్రసాద్‌ను వెంటనే బదిలీ చేయించాలని పలువురు టీడీపీ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకుల ఎదుట గోడును వెళ్లబోసుకున్నారని తెలిసింది.
అక్రమ లే అవుట్లపై కలెక్టర్ సీరియస్
Published Thu, Jun 15 2017 11:58 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement