ఎస్‌ఆర్‌బీసీ ఇంజినీర్లపై కలెక్టర్ అగ్రహం
శ్రీశైలం కుడి కాలువ పనులు పూర్తి చేసి, ఈ ఏడాది ఆవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పి ఎందుకు మాట మార్చుతున్నారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎస్‌ఆర్‌బీసీ ఇంజినీర్లపై అగ్రహం వ్యక్తం చేశారు.
– వాస్తవాలు దాచొద్దని హితవు
– గోరుకల్లు రిజర్వాయర్ లీకేజీపై కలెక్టర్ ఆరా
– ఆవుకులో 4 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశం
కర్నూలు(సిటి): శ్రీశైలం కుడి కాలువ పనులు పూర్తి చేసి, ఈ ఏడాది ఆవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పి ఎందుకు మాట మార్చుతున్నారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎస్‌ఆర్‌బీసీ ఇంజినీర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలపై జల వనరుల శాఖ ఇంజినీర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అద్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌బీసీ కాల్వపై సీఎం, మంత్రి పర్యటించిన సమయంలో గోరుకల్లులో 7 టీఎంసీలు, ఆవుకు జలశయంలో 4 టీఎంసీలు నిల్వ చేస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పినట్టు ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు.. తమాషాగా ఉందా మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుకులో 4 టీఎంసీలు నిల్వ చేస్తే టన్నెల్‌లోకి నీరు వెళ్లుతుందని, తాత్కలికంగా గోడ నిర్మించి నీటిని నింపుతామని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. మీరు ఏమైనా చేయండి ఆయకట్టు రైతులకు మాత్రం ఖచ్చితంగా నీరు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. లేకపోతే సంబంధిత ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోరుకల్లు లీకేజీపై దష్టిసారించాలని ఇంజనీర్లకు సూచించారు. కేసీ కాలువ వెంట అధికారులు పర్యటించి, అక్రమంగా కాల్వపై వేసుకున్న పైపులను, మోటార్లను తొలగించాలని ఎస్‌ఈని ఆదేశించారు. వెలుగోడు రిజర్వాయర్‌ను వారం రోజుల్లో నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఎస్‌ఆర్‌బీసీ–1,2 ఎస్‌ఈ సూర్యకుమార్, డీఆర్‌ఈ గంగాధర్‌గౌడు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.