రెండేళ్ల కోర్సుతో కళాశాలలు మూతపడుతున్నాయి
► వర్సిటీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి సమస్య తీసుకువెళ్లాలి
► ఇన్‌చార్జి వీసీకి బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్ల వినతి
ఎచ్చెర్ల క్యాంపస్ : జిల్లాలోని 17 బీఈడీ కళాశాలల ప్రధానాచార్యులు, కార్యదర్శులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిపాలన కార్యాలయంలో ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యతో బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు తమ సమస్యలు వివరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బీఈడీ కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీఈడీ కళాశాలల పరిస్థితిపై సమీక్షించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి ( ఎస్‌సీ టీఈ) సంస్థ 2015-16 విద్యా సంవత్సం నుంచి రెండేళ్లు బీఈడీ కోర్సు పరిమితిగా మార్పు చేసిందని, ఏడాది నుంచి రెండేళ్లు కోర్సు చేయటం వల్ల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. 90 శాతం ప్రవేశాలు జరిగే బీఈడీలో ప్రస్తుతం 20 శాతం జరుగుతున్నాయని, మరో పక్క కన్వీనర్ కోటాల్లో సీట్లుకే ప్రవేశాలు పరిమితం అవుతున్నాయని, మేనేజ్‌మెంట్ కోటాలో కనీసం ప్రవేశాలు జరగటం లేదని వివరించారు.
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తే ప్రవేశాలు 10 శాతం సైతం జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి, నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు కళాశాలలు నిర్వహిస్తే నష్టాల్లో కళాశాలల నిర్వహణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేవారు. వర్సిటీ ద్వారా ఉన్నత విద్యా మండలికి సమస్యలు తెలియజేయాలని, ఉన్నత విద్యా మండలి బీఈడీ కళాశాలల పరిస్థితి జాతీయ ఉపాధ్యాయ మండలి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. సమస్యలు వివరించిన వారిలో బీఆర్‌ఏయూ పాలక మండలి సభ్యులు బరాటం లక్షణరావు, ప్రిన్సిపాళ్లు అంబటి రంగారావు, బమ్మిడి సన్యాసిరావు, నర్సింహమూర్తి ఉన్నారు.