దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా చింతపల్లి, కొండమల్లేపల్లి, డిండి మండల కేంద్రాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు.
చింతపల్లి
దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా చింతపల్లి, కొండమల్లేపల్లి, డిండి మండల కేంద్రాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ వెల్లడించారు. మంగళవారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి పీఎస్‌లు, కొండమల్లేపల్లి సర్కిల్ ఆఫీస్ పరిధిలో గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి పీఎస్‌లు, డిండి సర్కిల్ ఆఫీస్ పరిధిలో నేరడుగొమ్ము, చందంపేట, డిండి పీఎస్‌లతో త్వరలో సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో గ్రామాల్లో పోలీస్ పల్లెనిద్ర తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22న పీపుల్స్ వారోత్సవాల సందర్భంగా దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె, రాచకొండ ఏరియాలలో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ నాగభూషణ్‌రావుతో పాటు సిబ్బంది ఉన్నారు.