నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలి
నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలి
Published Thu, Jul 21 2016 8:21 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
అడవిదేవులపల్లి (దామరచర్ల) : నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నడిగడ్డ, టెయిల్ పాండ్‌ల వద్ద జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. భూముల రకాలతో నిమిత్తం లేకుండా 2013 చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన సప్రీం కోర్టుకు సైతం వెళ్తామన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్ పాండ్ నిర్మాణంతో 8 ఎత్తిపోతల పథకాలు నీట మునగనున్నాయన్నారు. వీటి కింద ఉన్న 5 వేల ఎకరాలు ఎండి పోయే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని కోరారు. ముంపునకు గురయ్యే చిట్యాల, నడిగడ్డ, చింతలపాలెం, జమ్మికోట తండా వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. టెయిల్ పాండ్ జెన్‌కో ఎస్‌ఈ కుమార్ మాట్లాడుతూ సమస్య తీవ్రతను గుర్తించామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, జిల్లా అధ్యక్షుడు పాపానాయక్,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొప్పని పద్మ, మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, ఇంద్రారెడ్డి, ఎర్రానాయక్, మాజీ సర్పంచ్ కురాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement