అడవిదేవులపల్లిని మండలం చేయాలని తీర్మానం
అడవిదేవులపల్లిని మండలం చేయాలని తీర్మానం
Published Sat, Sep 17 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
దామరచర్ల : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని జెడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్ చేసిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కురాకుల మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తీర్మానం ప్రవేశ పెడుతూ అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేస్తే 10 గ్రామ పంచాయతీలు, 35 గిరిజన తండాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. దీన్ని సభ్యులందరూ బలపరిచారు. సమావేశానికి పలువురు అధికారులు రాకపోవడంపై సర్పంచ్‌లు లింగానాయక్, ముత్తయ్య, శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ కన్నెలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎవరికి విన్నవించాలని.. సమావేశానికి రానివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్వాకం వల్లే కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జెడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు బాలునాయక్, ఖాసీం, సింగిల్‌విండో చైర్మన్ నారాయణరెడ్డి ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. వేసవిలో నీటి సరఫరాచేసిన బిల్లులు వెంటనే ఇప్పించాలని సర్పంచ్ బాలునాయక్, ఎంపీటీసీ కిషన్ నాయక్ కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొందూటి మాధవి సిద్ధయ్య, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఈ ఆదినారాయణ, ఎంఈఓ మంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement