కవితపై మధుయాష్కీ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం పేరుతో ఎంపీ కవిత ఉద్యమ సమయంలో చేసిన కలెక్షన్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. పార్టీ నేతలు డి.శ్రవణ్, బి.బిక్షమయ్య గౌడ్‌తో కలిసి గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను నెరవేర్చడం చేతకాని ముఖ్యమంత్రిగా తన తండ్రి కేసీఆర్ ఉన్నాడన్న విషయాన్ని కవిత అంగీకరిస్తున్నారా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాని పని కవిత నేతృత్వంలో పనిచేస్తున్న జాగృతి అనే స్వచ్ఛంద సంస్థకు ఎలా సాధ్యం అవుతుంది? ఆ సంస్థకు నిధులెలా వస్తున్నాయి’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని కేసీఆర్ కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేటకు సర్పంచ్‌గా తిరుగుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడం చేతకాని ప్రభుత్వం కవిత ప్రచారం కోసం రూ.10 కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు.
భూ దళారిగా ప్రభుత్వం: దాసోజు
సర్కారు భూములను అమ్ముతూ ప్రభుత్వమే భూముల దళారిగా మారిందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నాడు భూముల అమ్మకాలను అడ్డుకున్న టీఆర్‌ఎస్ నేతలే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే పని చేయడం దుర్మార్గమన్నారు. పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలలో అక్రమ భూములు ఉన్నాయని కేసులు పెట్టిన టీఆర్‌ఎస్ నేతలు... మహేష్‌బాబు, నాగార్జునతో రాజీ చేసుకున్నారన్నారు.
కవితవి స్థాయికి మించిన మాటలు: సంపత్, ఆకుల లలిత
సాక్షి, హైదరాబాద్: ఎంపీ కవిత కాంగ్రెస్ నేతలపై తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం విమర్శించారు. ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. అధికార అహంకారంతో మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు. బతుకమ్మ పేరుతో కవిత రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. రైతుల రుణమాపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పరిహారం పేరుతో కలెక్షన్లు
Published Tue, Oct 13 2015 4:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement