పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 నుంచి 100 గేదెలతో ఒక్కో యూనిట్‌ను స్థాపించి పెద్ద ఎత్తున పాల ఉత్పత్తికి ఒక ప్రణాళిక సిద్ధం చేశామని, బ్యాంకర్లు కూడా ఈ యూనిట్‌లకు రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా గేదెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి కమిటీ చైర్మన్ గంటా నాగేశ్వరరావు, ఏపీ డెయిరీ జనరల్ మేనేజర్ పీవీ రావు, డైరెక్టర్లు ఎంఎస్‌సి చౌదరి, టి.రాజేంద్రప్రసాద్, జేవీ భాస్కరరావు, ఏపీ డైయిరీ ఉపసంచాలకులు సలీం పాల్గొన్నారు.
గంటలో గ్యాస్ కనెక్షన్
జిల్లాలో ఇంటింటా వంట గ్యాస్ ఉండాలనే లక్ష్యంతో అడిగిన వారందరికీ గంటలో వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఇండియన్ ఆయిల్ కంపెనీ ఫీల్ట్ అధికారి లోహితాక్షన్ కలెక్టర్‌ను కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీపం పథకం ద్వారా అడిగిన వారందరికీ వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో రెండు లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో వచ్చే డిసెంబర్ నాటికి ప్రతి పేద కుటుంబం విధిగా వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు.
దీనిపై స్పందించిన లోహితాక్షన్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా సరే వంటగ్యాస్ కనెక్షన్ కావాలంటే గంటలో ఇవ్వడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో శివశంకరరెడ్డి, గ్యాస్ డీలర్లు సాయిబాబా ఉన్నారు.