- 24 గంటలు డ్యూటీలు వేస్తున్నారని కానిస్టేబుళ్ల మండిపాటు
- పనిచేయమంటే ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎస్‌హెచ్‌వో
- తెరవెనక మామూళ్ల వ్యవహారమే కీలకమని సమాచారం
- మెడికల్ లీవ్‌లో 9 మంది కానిస్టేబుళ్లు
- కొత్తపేట స్టేషన్‌లో తారస్థాయిలో వివాదం
- వివాదం నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కానిస్టేబుల్స్ వర్సెస్ ఎస్‌హెచ్‌వో
Published Thu, Jan 12 2017 10:39 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
సాక్షి, గుంటూరు : గుంటూరు అర్బన్ జిల్లాలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో పని రగడ తారస్థాయికి చేరింది. కానిస్టేబుళ్ళు, సీఐల మధ్య గత 20 రోజులుగా అంతర్గతంగా సాగుతున్న రగడ నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పని పేరుతో సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు కానిస్టేబుల్ సీఐతో వాదనకు దిగి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అర్బన్ పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. వీరి మధ్య మామూళ్లకు సంబంధించి భేదాభిప్రాయాలు ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తొలుత వాగ్వివాదం.. ఆపై ఆత్మహత్యాయత్నం...
గురువారం ఉదయం కొత్తపేటలో పనిచేసే కానిస్టేబుల్ వెంకటేష్ సీఐతో తొలుత వాగ్వివాదానికి దిగాడు. డ్యూటీల పేరుతో తనను అసభ్య పదజాలంతో తిట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఐని తీవ్రస్థాయిలో అరిచి వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ త్రిపాఠీ.. అదనపు ఎస్పీ భాస్కరరావును విచారణ అధికారిగా నియమించారు.
కమర్షియల్ స్టేషన్...
ఈ పోలీస్‌స్టేషన్ అత్యధిక ఆదాయ వనరులున్నదిగా పేరుంది. సినిమా హాల్ మొదలుకుని బార్‌ల వరకు అన్నీ ఈ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా ఉండటంతో దీనిని కమర్షియల్ స్టేషన్‌గా పోలీసులు పిలుస్తుంటారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం వరకు వీఆర్‌లో ఉన్న శ్రీకాంత్‌బాబు స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఎస్‌హెచ్‌వో, కానిస్టేబుల్ మధ్య చిన్న చిన్న విషయాల్లో మొదలైన రగడ రోజురోజుకూ పెరిగి మామూళ్ల వ్యవహారం వరకు వచ్చినట్లు తెలిసింది. సీఐ మామూళ్లన్నీ తానే తీసుకుంటున్నాడనేది కానిస్టేబుళ్ల ఆరోపణ. పైగా పనిపేరుతో నిత్యం వేధిస్తున్నాడని చెబుతున్నారు. ఉదయం 8.30 గంటలకు డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్‌ను డ్యూటీ ముగిశాక కూడా పంపించకుండా మరుసటి రోజు 8.30 వరకు చేయాలని తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తున్నాడనేది కానిస్టేబుళ్ల అభియోగం. ఆయన పనిపేరుతో దూషించడం వల్ల 9 మంది కానిస్టేబుళ్ళు సెలవులో వెళ్ళిపోయారని, ఓ ఎస్‌ఐ కూడా వెళ్ళిపోయారని చెబుతున్నారు.
పని సక్రమంగా చేయమంటే.. ఆరోపణలు చేస్తున్నారు : సీఐ
ఈ ఆరోపణలపై సీఐ శ్రీకాంత్‌బాబు మాట్లాడుతూ పని సక్రమంగా చేయమని చెప్పిన దానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేష్‌కి ఖైదీ నంబర్ 150 సినిమా విడుదల రోజు హాల్ వద్ద డ్యూటీ వేస్తే చేయకుండా మఫ్టీలో తిరుగుతున్నాడని, తాను గుర్తించి ప్రశ్నిస్తే ఇలా చేశాడని తెలిపారు. మామూళ్ల వ్యవహారం తనకేమీ తెలియదని, వచ్చి 20 రోజులే అయిందని చెప్పారు.
Advertisement