బోధనను వీడి పోరుపథంలోకి..
బోధనను వీడి పోరుపథంలోకి..
Published Mon, Dec 5 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
మళ్లీ మొదలైన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమం
రాజమహేంద్రవరంలో దీక్షా శిబిరం ప్రారంభం
-చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్నాడో మహానుభావుడు. తాము సముపార్జించిన జ్ఞాననిధులను అలాంటి తరగతి గదుల్లో భావిపౌరులకు బోధించే కాంట్రాక్టు అధ్యాపకులు వర్తమానంలో తాము నిశ్చింతగా జీవించలేకపోతున్నామంటూ రోడ్లెక్కాల్సి వస్తోంది. పాఠాలు చెప్పిన నోటితో నినాదాలు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఉద్యమించాల్సి వస్తోంది.
ప్రతిపక్ష నాయకునిగా గతంలో చంద్రబాబునాయుడు కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తానని రాజమహేంద్రవరం దీక్షా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేయడం పట్ల అధ్యాపకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై గతంలో 37 రోజులుగా తీవ్రపోరు చేసారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం వారికి బేసిక్ పే మంజూరు చేసింది. దీంతో పాటు రెగ్యులర్ చేస్తామని చెప్పింది. అదేసమయంలో 2012 ఫిబ్రవరి 4న చంద్రబాబు రాజమహేంద్రవరంలోని దీక్షాశిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. ఉద్యోగభద్రతకు ఆడబిడ్డలు రోడ్డెక్కడం దుస్థితి అని వాపోయారు. తానొస్తే ఆ పరిస్థితి ఉండదని భరోసా ఇచ్చివెళ్లారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం తమను పట్టించుకోవడంలేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా సుమారు 40 జూనియర్, 15 డిగ్రీ, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 16 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరునెలలకోసారి జీతం ఇచ్చినా పంటి బిగువున పనిచేశారు. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామనే ఆశతో జిల్లాలో పని చేస్తున్న కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచామని కొత్తపేటకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుడు తనికెళ్ల శాస్త్రి ‘సాక్షి’తో అన్నారు. మంత్రివర్గం ఉపసంఘం నియమించి రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు రెండున్నరేళ్లుగా తమతో ఆడుకున్నారని రాజవొమ్మంగి ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు వాగు మాధవ్ మండిపడ్డారు. తమకు న్యాయం చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల్లో మోసకారి సర్కారుగా ప్రచారం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆశ అడియాస కాగా..
అప్పట్లో పోరాటం చేసి కొంత ఫలితం దక్కించుకున్నా కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసుకోలేకపోయారు. నాయకుల హామీలతో కొలువులు స్థిరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి అడియాస ఎదురయ్యేసరికి తిరిగి ఉద్యమం ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం ఇంటర్‌బోర్డు వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం నడుస్తుందని ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నాయకులు తెలిపారు. ఉదయం నుంచి జిల్లాలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పి.వీరబాబు, వి.కనకరాజు, యు.లక్ష్మణరావు, అమర్‌కళ్యాణ్, వి.మాధవ్, జీఎల్ మాణిక్యం పాల్గొన్నారు.
రేపు బూరుగుపూడిలో 'కడుపుకోత' సభ
ఈనెల ఏడున జిల్లా పర్యటనకు వస్తున్న ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో బూరుగుపూడి వద్ద భేటీ కానున్నామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర జేఏసీ నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు బూరుగుపూడి గేట్ వద్ద జరిగే కడుపుకోత సభకు రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement