‘కూలి’ కష్టం! | 'Coolie' hard! | Sakshi
Sakshi News home page

‘కూలి’ కష్టం!

Published Tue, Mar 14 2017 12:35 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘కూలి’ కష్టం! - Sakshi

‘కూలి’ కష్టం!

  •  ‘ఉపాధి’ కూలీల ఖాతాల్లోకి జమ కాని రూ.3 కోట్లు
  •  ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కూలీలు
  • రెండు నెలలుగా ఇదే దుస్థితి
  • ఆధార్‌ అనుసంధానం కాకపోవడమే కారణం
  •  18 శాతం మందికి బ్యాంక్‌ అకౌంట్లే లేని వైనం 
  • పనులు చేసినా కూలి డబ్బు తీసుకోలేని దయనీయ పరిస్థితి ఉపాధి హామీ కూలీలది. బ్యాంక్‌ ఖాతాలున్నా ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.3 కోట్లు బ్యాంకులకు వెళ్లి వెనక్కు వచ్చేసింది. జిల్లాలోని 1003 పంచాయతీల్లో 6,77,776 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 5,59,244 మందికి బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. 1,18,532 మందికి ఖాతాలు లేవు. గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు, మరికొందరి ఆధార్‌ సరిపోలకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్‌ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంకులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది వరకు కొన్ని పంచాయతీల్లో కూలీలకు బ్యాంక్‌ ఖాతాల ద్వారా, మరికొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు చేశారు. అయితే.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ  బ్యాంక్‌ ఖాతాల ద్వారానే కూలి డబ్బు అందిస్తున్నారు. ప్రతి రోజూ రెండు లక్షల మంది వరకు కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ప్రతి వారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లోని కూలీల బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు పది వేల మంది కూలీలకు రూ.3 కోట్లు అందించాల్సి ఉంది. ఈ డబ్బు బ్యాంకులకు వెళ్లినా ఆధార్‌ అనుసంధానం కాక వెనక్కు వచ్చేసింది. ప్రధానంగా కనగానపల్లి మండలంలో కూలీలకు ఉపాధి సొమ్ము అందలేదని తెలుస్తోంది.  

    18 శాతం మందికి ఖాతాల్లేవ్‌

    జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీల్లో 1,18,532 మందికి బ్యాంక్‌ ఖాతాలు లేవు. మొత్తం కూలీల్లో 18 శాతం మందికి అకౌంట్లు లేవు. గుడిబండ మండలంలో 10,594 మంది కూలీలుంటే 7091 మందికి, కదిరిలో 8,988 మందికి గాను 6,128, రొద్దంలో 11,367 మందికి 7,997, మడకశిరలో 11,795 మందికి గాను 8,263, చెన్నేకొత్తపల్లి మండలంలో 14,778 మందికి గాను 10,557 మందికి మాత్రమే బ్యాంక్‌ ఖాతాలున్నాయి. ఇలాంటి మండలాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. గుత్తి, గుంతకల్లు, పెద్దపప్పూరు, తాడిమర్రి, ఉరవకొండ మండలాల్లో మాత్రం 98 శాతానికి పైగా బ్యాంక్‌  ఖాతాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఖాతాలు తెరిపిస్తే కూలీలకు మేలు జరిగే అవకాశం ఉంది.

     

    చర్యలు తీసుకుంటున్నాం : నాగభూషణం, డ్వామా పీడీ

    ఉపాధి కూలీలందరికీ బ్యాంక్‌ ఖాతాలు తప్పనిసరి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ వ్యక్తిగత ఖాతాల్లోనే నగదు పడుతుంది. ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. కూలి చెల్లింపు సమస్య ఉన్న చోట ఆధార్‌ లింకేజీ చేయిస్తున్నాం. కూలీలు కూడా తమ ఖాతాలకు ఆధార్‌తో లింక్‌ చేయించుకుని మండల కంప్యూటర్‌ సెంటర్‌ (ఎంసీసీ)కు వెళ్లి అప్‌లోడ్‌ చేయించుకోవాలి. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement