కార్పొరేషన్ ఎన్నికలు మరింత ఆలస్యం?
డిసెంబర్‌లోగా కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామని ఒకవైపు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
– మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం
– స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో సమయం కోరేందుకు ప్రణాళిక
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి ఎదురుదెబ్బే
– తేల్చి చెబుతున్న ఆ పార్టీ సొంత సర్వేలు
– ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: డిసెంబర్‌లోగా కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామని ఒకవైపు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మార్చి నెలలో కానీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని సమాచారం. వాస్తవానికి నవంబర్‌లోగా కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతామంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. అయితే, ఇప్పటికీ కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి ఓటర్ల జాబితా పూర్తి కాలేదు. అదేవిధంగా వార్డులు.. కులాల వారీగా జనాభా వివరాలు కావాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీలోగా చేస్తామని మొదట్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల ఓటర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. దీంతో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిన తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని మరోసారి హైకోర్టును గడువు కోరేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉండటమే.. ఈ ఆలస్యానికి అసలు కారణంగా తెలుస్తోంది.
స్మార్ట్ సర్వే పేరుతో..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి స్మార్ట్ పల్స్ సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోనూ ఈ సర్వే జరుగుతోంది. ఇందులో అన్ని శాఖల సిబ్బంది భాగస్వాములు అవుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు 33 శాతం మాత్రమే కార్పొరేషన్ పరిధిలో పూర్తయ్యింది. సర్వే విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతి నెలా ఒకటి నుంచి పదో తేదీ వరకు పింఛన్ల పంపిణీలో బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలో సర్వే పనులు సాగడం లేదు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పూర్తి కావాల్సిన సర్వే కాస్తా నవంబర్ చివరి నాటికి కానీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వేను ఒక సాకుగా చూపి కూడా ఎన్నికలు మరింత ఆలస్యం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే, హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశం కీలకం కానుంది.
వైఎస్‌ఆర్‌సీపీ వైపే మొగ్గు
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని సర్వేలో తెలిసింది. అధికారపార్టీ నేతలు చేసుకున్న సొంత సర్వేలోనే ఈ విషయం తేటతెల్లమైనట్టు సమాచారం. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా వైఎస్‌ఆర్‌సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలను మరింత ఆలస్యం చేసుకుని.. ఈ సమయంలో తమ కేడర్‌కు మరింత పనులను నామినేషన్‌పై అప్పగించేందుకు అధికార పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. తద్వారా మరింత మందిని తమ వైపునకు తిప్పుకోవాలనేది అధికార పార్టీ నేతల ఆలోచనగా ఉంది.