రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది.
- 13 నియోజకవర్గాలకు 40 చొప్పున మంజూరు
- ఎస్‌డీపీ కింద రూ.12.85 కోట్లు కేటాయింపు
- ఇతర పరికరాలకు రూ.7.36 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్, మే నెలల్లో యాంత్రికీకరణ పథకానికి అనుమతి ఇచ్చిఉంటే ఉపయోగరకంగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఎస్‌డీపీ కింద రూ.20.21 కోట్లు బడ్జెట్ కేటాయింపు : ప్రస్తుతం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీపీ) కింద 520 ట్రాక్టర్లకు రూ.12.85 కోట్లు, ఇతర పథకం కింద మరికొన్ని యంత్ర పరికరాలకు రూ.7.36 కోట్లు మంజూరు చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల విషయానికొస్తే జిల్లాకు 520 మంజూరు కాగా అందులో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక్క ట్రాక్టర్ కూడా కేటాయించలేదు. మిగతా 13 నియోజక వర్గాలకు 40 చొప్పున కేటాయించారు. అధికారికంగా ఇన్‌చార్జ్ మంత్రి అనుమతులు తప్పనిసరి చేయడంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులకు ఇచ్చుకునే పరిస్థితి నెలకొనడంతో సామాన్య రైతులకు ట్రాక్టర్లు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇకపోతే జిల్లా వ్యవసాయశాఖ రూ.40.93 కోట్లు బడ్జెట్‌తో 14,739 యూనిట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపింది. రూ.20.21 కోట్ల బడ్జెట్‌తో ట్రాక్టర్లు, కొన్ని యంత్రపరికరాలకు అనుమతివ్వడం గమనార్హం.