చెయ్యి తడపాల్సిందే
- టీడీపీ సర్కారులో ఏ పని కావాలన్నా డబ్బివ్వాల్సిందే
- అవినీతి నిరోధక విభాగం నివేదిక స్పష్టీకరణ
- లంచాలు ఇవ్వనిదే సామాన్య ప్రజానీకానికి పని జరగడం లేదు
- రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్లు.. అన్ని శాఖల్లోనూ అవినీతి
- ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలోనూ సమర్పించుకోవాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: ‘ఇందుగలదు.. అందులేదన్న సందేహంబు వలదు..’.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, లంచాల దందా యధేచ్చగా కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, ఇదే అదనుగా మరోవైపు అధికార యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. లంచాల వ్యవహారం సామాన్య ప్రజానీకాన్ని ఎలా పట్టిపీడిస్తోందో ఈ ఏడాది అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు.. స్టాంపులు, మున్సిపల్, పంచాయతీరాజ్, హోం, గృహ నిర్మాణం, వాణిజ్యం.. తదితర అనేక శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో సైతం అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. పేదల ఇళ్ల బిల్లుల మంజూరుకు, పాస్ బుక్కులు ఇవ్వడానికి, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ జారీకి, భవన నిర్మాణ ప్లాన్ ఆమోదానికి.. ఇలా ఆయా శాఖల్లో పనులు కావాలంటే లంచాలు తప్పనిసరై పోయాయని ఏసీబీ ఆకస్మిక తనిఖీల నివేదిక పేర్కొంది. చివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఎంతోకొంత సమర్పించుకోవాల్సిందేనని.. లంచాలు లేనిదే ఏ విభాగంలోనూ ఎలాంటి పనీ జరగడం లేదని ఇటీవల ఏసీబీ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్‌బుక్ జారీకి లంచం తీసుకుంటున్నారు. పహాని జారీకి, పహానీలో, రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో, పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు మార్చాలంటే లంచం లేనిదే పని జరగడం లేదు.
- గృహ నిర్మాణ శాఖలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు, బిల్లుల వాయిదాల విడుదలకు, అలాగే ఇళ్ల డాక్యుమెంట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు.
- రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) జారీకి, డాక్యుమెంట్లు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్నారు. భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌కు డబ్బులు ఇవ్వడం తప్పనిసరి ప్రక్రియగా మారింది.
- మున్సిపల్ శాఖలో భవన నిర్మాణాల ప్లాన్ ఆమోదానికి, మంచినీటి కనెక్షన్ మంజూరు, తదితర పనులకు లంచం తీసుకుంటున్నారు.
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్స్‌కు లంచం తీసుకుంటున్నారు.
- హోంశాఖలో ఆధారాలతో సహా ఫిర్యాదును ఫైలు చేయడానికి, చార్జిషీటు నమోదుకు, ఎఫ్‌ఐఆర్ జారీ చేయడానికి, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, వస్తువులు తిరిగి ఇవ్వడానకి, నిందితులకు సహాయం చేయడానికి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు తీసుకుంటున్నారు.
- విద్యుత్ మీటర్లు, కనెక్షన్ల మంజూరుకు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితరాల ఏర్పాటునకు లంచాలు ఇవ్వడం ఇంధన శాఖలో సర్వసాధారణమైపోయింది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను పెంచి చూపిస్తూ నిధులు దండుకుంటున్నారు. సరుకుల కొనుగోలు అనధికారంగా చేస్తున్నారు. పేద పిల్లలకు చేరాల్సిన నిధులను చేతివాటంతో కాజేస్తున్నారు.
- వాణిజ్య పన్నుల శాఖలో చెక్‌పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసి వారిద్వారా డ్రైవర్లనుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. వ్యక్తిగత నగదు రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో పన్నుల ఎగవేతకు ఆస్కారం కల్పిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి గత నెల 25వ తేదీ వరకు ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రధానమైన కొన్ని కేసుల వివరాలు..
చెక్‌పోస్టులు/ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు.. ఆఫీసులో/ అధికారి వద్ద
పట్టుబడిన నగదు (రూ.లలో)
1. కె. శివశంకరరావు, ప్రాజెక్టు డెరైక్టర్, ఏలూరు, పశ్చిమగోదావరి 20,00,000
2. ఆర్.టీ.ఓ గాజువాక, విశాఖపట్నం జిల్లా 4,13,149
3. జి. సతీష్, ఎఫ్‌ఆర్‌ఓ -ఎం. నాగేశ్వరరావు, అటవీ సెక్షన్ ఆఫీసర్,
ఎల్,ఎన్.డి. పేట, పశ్చిమగోదావరి జిల్లా 2,39,000
4. ఆర్.సుబ్బారాయుడు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1,
జి. వెంకటేశ్వర్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2, గూడూరు, నెల్లూరు 1,92,000
5. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్-పుల్లంపేట, కడప జిల్లా 1,90,815
6. శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, ఉదయగిరి, నెల్లూరు జిల్లా 1,82,100
7. కె.నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ హాస్టల్ అధికారి, విశాఖపట్నం 1,08,978
8. లాల లజపతిరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఏలూరు 1,08,400