సన్మానం పేరుతో దందా
అయ్యగారి అభిమానం పొందేందుకు ఎక్సైజ్ అధికారులు అవినీతి దందాకు తెరలేపారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న ఓ జిల్లా స్థాయి అధికారికి సన్మానం పేరిట జిల్లాలోని మద్యం వ్యాపారుల నుంచి జోరుగా మామూళ్లు వసూలు చేస్తున్నారు.
-
నెత్తీనోరు బాదుకుంటున్న మద్యం దుకాణదారులు
-
వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారుల అక్రమ వసూళ్లు
నరసరావుపేట టౌన్: అయ్యగారి అభిమానం పొందేందుకు ఎక్సైజ్ అధికారులు అవినీతి దందాకు తెరలేపారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న ఓ జిల్లా స్థాయి అధికారికి సన్మానం పేరిట జిల్లాలోని మద్యం వ్యాపారుల నుంచి జోరుగా మామూళ్లు వసూలు చేస్తున్నారు. మద్యం వ్యాపారం సజావుగా సాగాలంటే ఓ పక్క అధికార పార్టీ నాయకులకు కప్పం మరో పక్క అధికారులకు నెలవారి మామూళ్లతో సతమతమవుతున్న మద్యం వ్యాపారులకు వసూళ్లు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది.
వ్యాపారులకు జరిమానా...
జిల్లాలో 140 బార్‌అండ్ రెస్టారెంట్‌లు, 330 వైన్స్‌షాపులున్నాయి. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకొన్న వ్యాపారులు ఆయా నియోజక వర్గాల్లోని అధికార పార్టీ నాయకులకు పెద్దమొత్తంలో కప్పం చెల్లించారు. కొన్నిప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులకు దుకాణాల్లొ భాగస్వామ్యం కల్పించారు. వీటితో పాటు ప్రతినెలా స్థానిక అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు సైతం మామూళ్లను వ్యాపారులు ముట్టచెప్పాల్సి ఉంది. దీంతోపాటు ఉన్నతస్థాయి అధికారులు ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన సమయంలో.. అధికారుల గృహాల్లో శుభకార్యాల వేళల్లో అదనంగా వ్యాపారులకు జరిమానా పడుతూ ఉంటుంది. వీటన్నింటితో సతమతమవుతున్న మద్యం వ్యాపారులకు అధికారుల పదవీ విరమణ సన్మానం సమయంలో అక్రమ వసూళ్లు ఏమిటంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఈ చర్యను కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తుండగా మరికొందరు సమస్యలు తలెత్తుతాయని భావించి మిన్నకుండి ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. ఐదు రోజులుగా నరసరావుపేట డివిజన్‌లోని మద్యం వ్యాపారులతో జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొందరు సమావేశం నిర్వహించి సన్మాన కార్యక్రమ ఖర్చుకు సహకరించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ళ వ్యవహారంతో మద్యం వ్యాపారులలో అలజడి రేగుతోంది.