నిలువు దోపిడీ!
♦ వెలుగొండ భూసేకరణలో భారీ అవినీతి
♦ ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు
♦ రూ.970 కోట్లకు పెరిగిన భూసేకరణ వ్యయం
♦ గత కేటారుుంపులతో పోల్చితే రూ.462 కోట్లు అదనంగా పెంపు
♦ కొత్త ప్రతిపాదనలకు నేడో.. రేపో ఆమోద ముద్ర
♦ సేకరించాల్సిన భూమి 41,480 ఎకరాలు
♦ సేకరించింది 24,908 ఎకరాలు
♦ ముందుకు సాగని భూసేకరణ
అధికారపార్టీ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. వెలుగొండ భూసేకరణ పేరుతో ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచుకొని కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. భూసేకరణకు గత ప్రభుత్వం రూ.508 కోట్లు మాత్రమే కేటాయించగా తాజాగా చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. పెరిగిన అంచనాలకు ఒకటి, రెండు రోజుల్లో ఆమోదముద్ర పడనుంది. ఈ అవినీతిలో ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లుఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ కోసం గతంలో ప్రభుత్వం రూ.508 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయగా, చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే భూముల ధరలు పెరిగాయని చూపించి అంచనాలను రూ.462 కోట్లు పెంచుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా నేడో.. రేపో ఆమోద ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కలిసి వెలుగొండ భూసేకరణ పేరుతో తెరలేపిన భారీ అవినీతికి ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారులు కూడా సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి.
ఇందులో ప్రభుత్వ అధినేతతో పాటు నీటిపారుదల శాఖ మంత్రికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వారి సూచనల మేరకే కాంట్రాక్టర్లు దోపిడీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో అన్ని విభాగాల్లో అంచనాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి కాంట్రాక్టర్లు నిలువు దోపిడీకి సిద్ధమవ్వడం పట్ల ఇంజినీరింగ్ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వాలు దోపిడీకి పాల్పడ్డాయని పనిగట్టుకొని విమర్శలు చేసే చంద్రబాబు సర్కారు ఇంత భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపడంపై నీటిపారుదల శాఖ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. పోనీ భూసేకరణ అయినా వేగవంతంగా చేస్తున్నారంటే అది లేదు. బాబు రెండేళ్ల పాలనలో పట్టుమని 100 ఎకరాలు కూడా సేకరించిన పాపానపోలేదు. పని చేయకుండానే అంచనాల పెంపు పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమవ్వడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నత్తనడకన భూసేకరణ..
ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో విస్తరించిన ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కింద డ్యామ్‌లు, రహదారులు, కాలువలు పరిధిలో మొత్తం 41,480 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ, గొట్టిపడియ, వెలుగొండ తూర్పు ప్రధాన కాలువ, ఉదయగిరి ఉపకాలువ, పడమర ఉపకాలువ, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల డ్యామ్, సుంకేశుల డ్యామ్ తదితర వాటి పరిధిలో ఈ మొత్తం భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 24,908 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు చెబుతున్నా 14,823 ఎకరాలు మాత్రమే భూములు సేకరించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 7,585 ఎకరాలు అటవీ భూములున్నాయి. ఈ లెక్కన ఇంకా 26,657 ఎకరాలు భూములను సేకరించాల్సి ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా భూసేకరణ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం.