కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట
వరంగల్ ఉప ఎన్నికపై మావోయిస్టు పార్టీ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య అహంకారానికి పరాకాష్ట అని సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మండిపడ్డారు. దీన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏడా దిన్నర కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు, దళారి భూస్వామ్య వర్గాలకు కొమ్ము కాసిందే తప్ప పేదలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. ఈ మేరకు జగన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు ఎజెండానే తన ఎజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఫ్యూడల్ తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారన్నారు.
ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచడానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలపై కనీ సం స్పందించకుండా నీరో చక్రవర్తి మాదిరిగా ఫామ్‌హౌస్‌లో తందనాలు ఆడుతున్నారన్నా రు. తెలంగాణలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, వనరులను తమ వారికి దోచిపెట్టేం దుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారన్నారు. అందుకే మావోయిస్టురహిత ప్రాం తంగా మలిచేందుకు ఆది లాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న ఆదివాసీ గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వేలా ది గ్రేహౌండ్స్ బలగాలను దించి హంతక వేట కొనసాగిస్తున్నారన్నా రు.
ములుగు ఏజెన్సీలో 1,500 ఎకరాలను మైనింగ్ మాఫియాకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే శ్రుతి, విద్యాసాగర్‌లను ఎన్‌కౌంటర్ చేశారన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీఆర్‌ఎస్ పాలకులు ఏముఖం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీతి తప్పిన దొం గలుగా పేరుపడ్డ తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వంటి వారిని మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తండ్రి అధికారంతో కళ్లు నెత్తికెక్కిన మంత్రి కేటీఆర్‌కూ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మోదీ ప్రభుత్వం తమ హంతక ముఠాలైన ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్ వంటి శక్తులతో దళితులు, మైనారిటీలపై దాడులకు తెగబడుతోందని, వారూ మూల్యం చెల్లించక తప్పదన్నారు.