‘హంద్రీ-నీవా’ వైఎస్సార్‌ పుణ్యమే | cpi meeting on handrineeva | Sakshi
Sakshi News home page

‘హంద్రీ-నీవా’ వైఎస్సార్‌ పుణ్యమే

Published Wed, Aug 30 2017 11:16 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

‘హంద్రీ-నీవా’ వైఎస్సార్‌ పుణ్యమే - Sakshi

‘హంద్రీ-నీవా’ వైఎస్సార్‌ పుణ్యమే

రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  
3.55 లక్షల ఆయకట్టును బీళ్లుగా మార్చిన చంద్రబాబు
సీఎం వైఖరితో జిల్లాలో వ్యవసాయం చిన్నాభిన్నం
సాగునీటి సాధనను ప్రతి రైతూ హక్కుగా భావించాలి
విపక్షాలను కలుపుకుని త్వరలో రైతు చైతన్యయాత్ర


బుక్కపట్నం(పుట్టపర్తి): హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకువచ్చిన  ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని రాప్తాడు నియోజకవర్గ  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తాగు, సాగునీటి సాధనపై బుధవారం పుట్టపర్తిలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 2006-07లోనే హంద్రీ-నీవా పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జీవం పోశారన్నారు. అనుకున్నదే తడవుగా రెండేళ్లలోనే దాదాపు 70 శాతానికి పైగా పనులు పూర్రిత చేశారని గుర్తుచేశారు. వైఎస్‌ చలవతోనే నేడు జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం చంద్రబాబుకు, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు  చిత్తశుద్ధి లేకుండాపోయిందన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వారే హిందూపురంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు.

ఆయకట్టును బీళ్లుగా మార్చిన చంద్రబాబు
మహోన్నత ఆశయంతో వైఎస్సార్‌ తలపెట్టిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం నిర్వీర్యం చేశారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని 3.55 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది వైఎస్సార్‌ లక్ష్యమని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన బుక్కపట్నం చెరువుకు హంద్రీనీవా నీటి కేటాయింపులు ఇస్తూ జీఓ చేసింది కూడా వైఎస్సారేనని అన్నారు. అయితే అధికారం చేపట్టగానే హంద్రీ-నీవా ఆయకట్టును రద్దు చేస్తూ.. 3.55 లక్షల ఎకరాలను బీళ్లుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.

ఇందులో హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 2.50 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయని తెలిపారు. సాగునీరు అందక పొరుగు రాష్ట్రాలకు రైతులు వలస వెళ్లాల్సిన దౌర్భగ్య స్థితిని కల్పించారంటూ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరి వల్ల జిల్లాలో వ్యవసాయం చిన్నాభిన్నమైందన్నారు. ఈ విషయంపై ‍జిల్లా రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విపక్షాలను కలుపుకుని త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. సాగునీటి సాధనను హక్కుగా పొందేలా హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రైతులు సంఘటితమై తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం కోసం సీపీఐ చేపట్టే ఉద్యమాలకు పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.

8 నుంచి రిలేదీక్షలు
తాగు, సాగునీటి సాధన కోసం సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలేదీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పడిన తపనను కొనియాడారు. ఉద్యమాలతోనే తాగు, సాగునీటి పథకాలు పూర్తి అవుతాయని, ఈ విషయంలో రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం కోసం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రకాష్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణస్వామి, జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement