'అడ్డొస్తాడనే బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంకు'
తాడిపత్రి : 'ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మొదటి ర్యాంకు ఇవ్వడం హాస్యాస్పదం. తెలంగాణలో (హైదరాబాద్)లో నివాసముంటున్న బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంకా? ఈ ర్యాంకులన్నీ బోగస్సే. తన సీఎం పదవికి తనకు అడ్డొస్తాడేమోనన్న భయంతోనే మొదటి ర్యాంకు ఇచ్చారని' సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీపై ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. డబ్బుల్లేవంటూనే గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో.. ఘోరమైన ఫలితాలు వెలువడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఈ సర్వే ఆధారంగా ర్యాంకింగులు ఇచ్చారు. ఎమ్మెల్యేల ఈ మెయిళ్లకు సర్వే నివేదికను పంపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఎమ్మెల్యేలకు జిల్లాల స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా విడివిడిగా ర్యాంకులు ఇచ్చిన విషయం తెలిసిందే.