శ్రామిక రాజ్యంతోనే దోపిడీకి అంతం
కష్టాల విముక్తికి సోషలిజమే పరిష్కారం
సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం అర్బన్ : దోపిడీ అంతం కావాలంటే శ్రామికుల రాజ్యం రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ అన్నారు. కష్టాల నుంచి విముక్తి పొందేందుకు సోషలిజాన్ని స్థాపించడమే పరిష్కార మార్గమన్నారు. రష్యా విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక హెచ్‌ఎల్‌సీ వద్దనున్న మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం కార్యాలయంలో నగర కమిటీ కార్యదర్శి నాగేంద్రకుమార్ అధ్యక్షతన విప్లవ వార్షికోత్సవ సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన రాంభూపాల్ మాట్లాడుతూ రష్యన్ ప్రజలు 75 ఏళ్లలో పెట్టుబడిదారీ వ్యవస్థకు భిన్నంగా సామ్రాజ్యవాదాన్ని అమలు చేసి నిరుద్యోగం, పేదరికం, అసమానతలు లేని వ్యవస్థను నిర్మించుకున్నారన్నారు. ప్రజలపై ఎటువంటి భారాలు, ధరల ప్రభావం లేకుండా విద్య, వైద్యం, పిల్లల సంరక్షణ బాధ్యతలను అక్కడి ప్రభుత్వమే తీసుకుందన్నారు. భారత దేశ స్వాతంత్య్రానికి కూడా రష్యా విప్లవం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సోషలిజంతోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, సీపీఎం నాయకులు బీహెచ్‌రాయుడు, గోపాల్, నాగరాజు, ముర్తుజా, ప్రకాశ్, బాబు, వలి, డీఐఎఫ్‌ఐ నాయకులు బాలకృష్ణ, నూరుల్లా, ఏఐఎస్‌ఎఫ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.