
బెట్టింగ్‌ల అడ్డాగా...తోటపల్లి
బెట్టింగ్ దందా పల్లెలకూ పాకుతోంది. పలువురు బెట్టింగ్‌రాయుళ్లు యువకులను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు.
బెట్టింగ్ దందా పల్లెలకూ పాకుతోంది. పలువురు బెట్టింగ్‌రాయుళ్లు యువకులను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇరుక్కుని అప్పులపాలైనవారు ఆస్తులు తెగనమ్ముకుంటున్నారు. బకాయిల వసూళ్లకు యువకులను ఏజెంట్లుగా వాడుకుని ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో విషసంస్కృతికి బీజం వేస్తున్నారు. వారి బంగారు
భవిష్యత్తును దుర్వ్యసనాలకు బలిచేస్తున్నారు.
పార్వతీపురం: కొన్నేళ్లుగా పార్వతీపురం కేంద్రంగా నడిచిన క్రికెట్ బెట్టింగ్ పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు పార్వతీపురం చుట్టు పక్కల ఉన్న గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస తదితర మండలాల్లోని పలు గ్రామాలకు పాకినట్లు సమాచారం. ఆయా గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ బెట్టింగ్ కాస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. బెట్టింగ్ ద్వారా బకాయిపడిన మొత్తాలు తీర్చమంటూ బుకీలనుంచి ఒత్తిడి ఎదురవుతుండటంతో ఎక్కడ తమ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడతారోనన్న బెంగతో, భూములను తెగనమ్మి ఆ అప్పులు తీరుస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
తోటపల్లి కేంద్రంగా...
గరుగుబిల్లి మండలం తోటపల్లి కేంద్రంగా ఈ దందా ఎక్కువైనట్టు సమాచారం. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, విశాఖకు చెందిన మరో వ్యక్తి కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన వ్యక్తులూ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. బాకీపడిన మొత్తాల వసూళ్లకోసం గ్రామాలకు చెందిన యువకులను ఏజెంట్లుగా నియమించుకుని వారికి మద్యం బాటిళ్లు, బిరియానీ లు నజరానాగా ఇచ్చి బైక్‌లపై పల్లెలకు పంపిస్తున్నారు. దీనివల్ల పల్లెల్లో వివాదాలు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నపళంగా ధనవంతులు
ఒకప్పుడు ఏమీ లేని కొంతమంది వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ బుకీలుగా అవతారం ఎత్తాక ఉన్న ప ళం గా ధనవంతులుగా మారినట్లు సమాచారం. వీరు నిత్యం యువతకు వల విసిరి ఈ ఉచ్చులోకి దింపుతున్నారనీ, పోలీసులను కూడా తాము మేనేజ్ చేశామని ఆయా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. పోలీసు ల నిఘా తగ్గడంవల్లే ఈ అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి.
ఇప్పటికే కేసులు నమోదు చేశాం
ఈ విషయమై గరుగుబిల్లి ఎస్సై వి.లోవరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా భూములు అమ్ముకునే విషయం. బుకీల కలెక్షన్లు తమకు తెలియదని చెప్పారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు. అనుమానితులు గ్రామంలోకి రాకుండా నిఘా పెట్టామని తెలిపారు.