2016 అండర్–19 విజేత జిల్లా జట్టు
-
గత సీజన్‌లో నాలుగు టైటì ళ్లు గెలిచిన పాలమూరు
-
ఈ ఏడాది అండర్–19, అండర్–23 టోర్నీల్లోనూ చాంపియన్
-
కంబైన్డ్ జట్టులో జిల్లాదే ఆధిపత్యం
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ విస్తరిస్తోంది. అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–20, అండర్–25 విభాగాల క్రీడాకారులకు మహర్దశ కలగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాజట్లు రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీల్లో సత్తాచాటుతున్నారు. గతేడాది ఒకే సీజన్‌లో జిల్లా జట్లు అండర్–23, అండర్–19, అండర్–16, అండర్–14 టోర్నీల్లో టైటిళ్లు కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. అండర్–23 సీనియర్ లీగ్ టోర్నీల తొలిసారిగా విజేత నిలిచిన జిల్లా జట్టు నుంచి కంబైన్ట్ జట్టుకు నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్–19 జట్టులో ఆరుగురు, అండర్–16లో నలుగురు క్రీడాకారులు కంబైన్డ్ రాష్ట్ర జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించారు. ఈ ఏడాది అండర్–23 టోర్నీలో ఎక్కువపాయింట్ల పొంది తొలిస్థానంలో నిలవగా ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన అండర్–19టోర్నీలో గెలుపొందింది.
గతంలో 9సార్లు చాంపియన్
జిల్లా జట్టు అద్వితీయ ప్రతిభతో గతంలో హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో తొమ్మిది సార్లు విజేతగా నిలిచింది. తొలిసారిగా 1986లో జిల్లా కేంద్రంలో జరిగిన సీనియర్ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన జిల్లా జట్టు 1991లో నల్లగొండ, 1993లో మహబూబ్‌నగర్, 2000లో హైదరాబాద్‌లలో జరిగిన సీనియర్ టోర్నీల్లో జిల్లా చాంపియన్‌గా నిలిచింది. 2010లో హైదరాబాద్‌లో జరిగిన అండర్–16, అండర్–19 టోర్నీలతో పాటు 2011లో హైదరాబాద్‌లో వరుసగా అండర్–25, అండర్–19 గెలిచి అండర్–16, అండర్–14 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2013లో హైదరాబాద్‌లో జరిగిన ట్వీ–20లో గెలుపొందింది.
జిల్లాకేంద్రంలో హెచ్‌సీఏ మైదానం...
జిల్లాకేంద్రంలో హెచ్‌సీఏ క్రికెట్ మైదానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మైదానంలో లేవలింగ్ పనులను పూర్తిచేశారు. ఇటీవల పనులను హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్ పరిశీలించారు. డిసెంబర్‌లోగా మైదానం పనులను పూర్తి చేసి క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మైదానంలో ప్రేక్షకుల గ్యాలరీ, పెవిలియన్ బిల్డింగ్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇక్కడే అకాడమీని ఏర్పాటు చేసి ప్రతిభ కనబరిచిన 40 నుంచి 60 మంది క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేసి కోచ్‌లతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నారు.
ఓపెనర్‌గా రాణిస్తున్న షాకీర్‌ఖాన్
షాకీర్‌ఖాన్ 2009లో జిల్లాస్థాయి క్రికెట్‌లో ప్రవేశించాడు. కొద్దికాలంలోనే మంచి ప్రతిభ కనబరుస్తూ ఓపెనర్‌గా స్థానం దక్కించుకున్నాడు. 2011లో జిల్లాస్థాయి టోర్నీ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. హైదరాబాద్‌లో జరిగిన కోకకోలా కప్‌లో రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఈ టోర్నీ రాణింపుతో 2012లో తొలిసారిగా హెచ్‌సీఏ అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. ఇదే ఏడాది సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్ జట్టుకు ఆడి రెండు అర్ధసెంచరీలు చేశాడు. గతేడాది జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపీఏల్ టోర్నీలో సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు. అలాగే హెచ్‌సీఏ అండర్–19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఎండీసీఏ లీగ్ టోర్నీలో సెంచరీ చేసి ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలæజరిగిన అండర్–19 టోర్నీలో 190పరుగులు చేసి రాణించాడు. భవిష్యత్‌లో ఓపెనర్‌గా మరిన్ని సెంచరీలు సాధించి రంజీజట్టుకు ఎంపికవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు షాకీర్‌ఖాన్.
అండర్–19 సారథి గణేష్...
గణేష్ ఇటీవల జరిగిన అండర్–19 టోర్నీలో కెప్టెన్‌గా జట్టు గెలుపొందడంతో కీలకపాత్ర పోషించాడు. డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులో ఉన్న గణేశ్ బౌలింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్నాడు. 96పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు తీసి రాణించాడు. 2015 ఏడాదిలో హెచ్‌సీఏ అండర్–16, అండర్–19, ఈ ఏడాది అండర్–23జట్టుకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది అండర్–16 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రంజీ జట్టులో ఆడాలన్నదే తన లక్ష్యమంటున్నాడు గణేష్.
నాలుగు టైటిళ్లు గెలవడం గర్వంగా ఉంది...
తెలంగాణ జిల్లాల పరిధిలో గతేడాది సీజన్‌లో నాలుగు టైటిళ్లు గెలవడం గర్వంగా ఉంది. ఈ ఏడాది అండర్–19 టోర్నీ విజయాల పరంపరను ప్రారంభించాం. ఇక్కడి క్రీడాకారుల ఉన్న ప్రతిభను చూసి జిల్లా కేంద్రంలో హెచ్‌సీఏ మైదానానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్‌లోగా మైదానం పనులు పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. అకాడమీని ప్రారంభించి క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాం. – రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి