పెరుగుతున్న పంట నష్టం
1,212 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
కొనసాగుతున్న సర్వే
కరీంనగర్‌అగ్రికల్చర్ : ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతుంది. నిల్వ నీరు తొలగిపోవడంతో వ్యవసాయాధికారుల సర్వేలో దెబ్బతిన్న పంటలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మండలాల్లో 1,212 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏ రోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. 660 ఎకరాల్లో వరి, 160 ఎకరాల్లో మొక్కజొన్న, 392 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు. కరీంనగర్, మల్యాల, బోయినిపల్లి, కమలాపూర్, హుస్నాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, మహదేవపూర్, కాటారం, మంథని, కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని గుర్తించారు. కాగా, సర్వే ఇంకా పూర్తి కాలేదు. పంటలు కోత దశకు రాకముందే పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదించేందుకు వ్యవసాయశాఖాధికారులు వేగం పెంచారు. వర్షాధార పంటల్లో నష్టపోయిన పంటలకు సర్కారిచ్చే పరిహారం కింద వరికి హెక్టారుకు రూ.13,500, మొక్కజొన్నకు రూ.8,333, పత్తికి రూ.6,800 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దెబ్బతిన్న 1,212 ఎకరాలకు రూ.51.64 లక్షల మేర నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇంకా తుది నివేదిక పూర్తికాలేదని, సర్వే కొనసాగుతోందని అధికారులు తెలిపారు.