సాగు పెరిగి.. ధర మురిగి!
సాగు పెరిగి.. ధర మురిగి!
Published Mon, Nov 21 2016 11:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
టమాట రైతుల గగ్గోలు
– పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కక నష్టపోతున్న రైతాంగం
– నాణ్యతా లోపం సాకుతో ధరకు తూట్లు
- వ్యాపారుల తీరుతో బేజారు
– స్పందించని మార్కెటింగ్ శాఖ
కర్నూలు(అగ్రికల్చర్)/పత్తికొండ: టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. మామూలు రోజుల్లో ఈ సమయానికి టమాట ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే సాగు పెరిగి దిగుబడి అధికంగా రావడంతో ధర తగ్గింది. ఈ ఏడాది కూరగాయలు సాగు చేసిన రైతులందరూ నష్టాలను మూటగట్టుకున్నారు. రెండు నెలల క్రితం వరకు టమాట ధరలు పడిపోయి రైతులు నష్టపోయారు. దీంతో పాటు మిరప, వంకాయ, కాకర తదితర కూరగాయల ధర కూడా నేల చూపులు చూసింది. మొన్నటి వరకు ఒక మోస్తరుగా ఉన్న టమాట ధరలు పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో పత్తికొండ, డోన్, ఆస్పరి, పెద్దకడుబూరు, దేవనకొండ, ప్యాపిలి, హాలహర్వి, ఓర్వకల్లు, వెల్దుర్తి, కల్లూరు, కర్నూలు మండలాల్లో టమాట సాగు ఎక్కువగా ఉంది. రబీకి సంబంధించి జిల్లాలో టమాట సాధారణ సాగు 6,500 హెక్టార్లు ఉండగా, 5వేల హెక్టార్లకు పైగా సాగయింది. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. ఒకేసారి జిల్లా వ్యాప్తంగా దిగుబడులు మార్కెట్లోకి రావడంతో డిమాండ్ పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టినా రూ.10 వేలు కూడా చేతికి రాకపోవడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఉల్లి సాగు చేసిన రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. అదే బాటలో టమాట రైతులు నష్టపోతున్నారు.
పట్టించుకోని మార్కెటింగ్ శాఖ
ధరలు తగ్గినపుడు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన టమాటను సేకరించి హైదరాబాద్ ప్రాంతాలకు తరలించి రైతు బజార్లు, ఇతరత్రా అమ్మకాలు సాగించేలాడాల్సి ఉంది. కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో టమాట మార్కెట్లో డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి టమాట పోటెత్తుతోంది. అయితే తగిన నాణ్యతతో లేదని వ్యాపారులు ధరలకు తూట్లు పొడుస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిటైల్‌గా కిలో ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఉండగా, రైతులకు మాత్రం కిలోకు 50పైసలుదక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బొట్లకు అడుగుతున్న వ్యాపారులు
టమాటలో తగిన నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు ధరలను చిదిన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15కిలోలకు కనీసం రూ.100 ధర లభిస్తే రవాణా చార్జీలు, కూలీ ఖర్చులైనా గిట్టుబాటు అవుతాయి. కానీ కిలోకు రూపాయి కూడా లభించకపోవడంతో రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లపై మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టి లేకపోవడం వల్లే వ్యాపారులు అన్ని ప్రాంతాల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement