కరెన్సీ కల్లోలం | currancy effect | Sakshi
Sakshi News home page

కరెన్సీ కల్లోలం

Published Wed, Nov 9 2016 11:34 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

కరెన్సీ కల్లోలం - Sakshi

కరెన్సీ కల్లోలం

పెద్ద నోటు 'అనంత' వాసుల్లో కల్లోలం సృష్టించింది. రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం అనంత జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం పాలప్యాకెట్‌ నుంచి రాత్రి గుడ్‌నైట్‌ కాయిల్స్‌ వరకు ఏది కొనేందుకు వెళ్లినా పెద్దనోట్లను వ్యాపారులు స్వీకరించలేదు. బ్యాంకులు, ఏటీఎంలు మూసేశారు. చిన్ననోట్లు ప్రజల వద్ద లేవు. పండ్లు, కూరగాయల వ్యాపారం జరగక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రేక్షకులు లేక సినిమాహాళ్లు... వినియోగదారులు లేక బంగారు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, బేకరీలు, కిరాణా షాపులు... ఇలా అన్ని రకాల దుకాణాల్లో కనీసం బోనీ కూడా కాలేదు.   ఒక్కమాటలో చెప్పాలంటే పెద్దనోట్ల రద్దుతో బుధవారం 'అనంత' జీవనం పూర్తిగా స్తంభించింది.

పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన 30 నుంచి 50 శాతం ప్రజల్లోకి వెళ్లింది. బుధవారం ఉదయం వరకూ తక్కిన 50శాతం మందికి తెలీదు. ఇంట్లోని పెద్దనోట్లను తీసుకుని ఉదయం పాలప్యాకెట్‌ కోసం వెళితే చిల్లర ఇవ్వండని వ్యాపారులు అడిగారు. ఏంటని ఆరా తీస్తే... పెద్దనోట్లు చెల్లవని తెలుసుకున్న వినియోగదారులు అవాక్కయ్యారు. పోనీ ఏటీఎంకు వెళదామంటే మూసేశారు. చిన్నపిల్లలకు పాలు కావాలి. జేబులో చిల్లర లేదు. ఉన్ననోట్లు చెల్లవు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిల్లర లేక కొంతమంది ఇళ్లవద్దకు వచ్చే కూరగాయాలు కొనలేకపోయారు. ప్రజల అవస్థలు చూసిన వ్యాపారులు అప్పు కింద కూరగాయలు ఇచ్చారు.  

పెట్రోలు బంకుల్లోనూ అదే పరిస్థితి
ఈనెల 11 వరకూ పెట్రోలు బంకులు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లలో పెద్దనోట్లు చెల్లుతాయని ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో పెద్దనోటు తీసుకెళ్లి వందో, రెండొందలకో పెట్రోలు వేయించుకునేందుకు చాలా మంది ఎగబడ్డారు.  పెద్దనోటు చూడగానే పెట్రోల్‌ బంక్‌ వద్ద సిబ్బంది చిల్లర లేదని చెప్పేశారు. దీంతో వాహనదారులు వాదనకు దిగారు. వందనోట్ల కొరత ఉందని, రూ.500కు పెట్రోలు వేయించుకోండని చెప్పారు. చేసేది లేక వాహనదారులు నోటు మొత్తానికి పెట్రోలు వేయించుకున్నారు.

టోల్‌గేట్‌... ట్రాఫిక్‌ జామ్‌
మరూరు, గుత్తి సమీపాల్లో ఉన్న టోల్‌గేట్లలో బుధవారం తెల్లవారుజామున నుంచి పెద్దనోట్లు తీసుకోలేదు. వాహనదారుల వద్ద పెద్దనోట్లు మినహా చిల్లర లేదు. ఇవి టోల్‌ సిబ్బంది తీసుకోలేదు. టోకెన్‌ తీసుకోకుండా వాహనం ముందుకు వెళ్లదు. దీంతో వాహనాలు టోల్‌గేట్‌ వద్ద ఆగిపోయి, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌ అయింది. దాదాపు సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి. ఇది తెలిసి కొంతమంది వందనోట్లను తీసుకెళ్లి వాహనదారులకు చిల్లర అందజేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 11 వరకూ టోల్‌గేట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సమస్య సద్దుమణిగింది.

బోసిపోయిన వ్యాపార దుకాణాలు
జిల్లాలో వస్త్రదుకాణాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫర్నీచర్, హోల్‌సేల్‌ వ్యాపారాలు రోజూ రూ.కోట్లలో లావాదేవీలు జరిగేవి. కానీ బుధవారం కరెన్సీ సమస్యతో వ్యాపారాలు బోసిపోయాయి.  కొన్ని షాపుల్లో కనీసం బోనీ కూడా కాలేదు. రిలయన్స్‌ మాల్స్, మోర్, పవిత్ర హైపర్‌మార్ట్, రిలయన్స్‌ ట్రెండ్స్‌ లాంటి మాల్స్‌లు రోజువారీ వ్యాపారంతో పోల్చితే బుధవారం 80శాతం తగ్గింది.

బోసిపోయిన సినిమా హాళ్లు
పెద్దనోట్ల రద్దు ప్రభావం వినోదంపై కూడా పడింది. సినిమా థియేటర్లకు వెళితే చిల్లర దొరుకుతుందనే కారణంతో మార్నింగ్‌షోకు గంట ముందే టికెట్‌ కౌంటర్ల వద్ద జనం బారులు తీరారు. పెద్దహీరో రిలీజ్‌ సినిమాను తలపించేలా థియేటర్‌ ప్రాంగణాలు కిక్కిరిశాయి. కానీ కౌంటర్‌ ఓపెన్‌ చేస్తే అంతా రూ.500, వెయ్యి నోట్లు ఇచ్చారు. ఇవి చెల్లవని చెప్పడంతో చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. బొమ్మపడే సమయానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఒక్కో షోకు పదిమందిలోపే ఉన్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ప్రేక్షకులు లేక, నోట్ల గందరగోళంతో షో ఆపేద్దామని భావించినట్లు అనంతలోని త్రివేణి థియేటర్‌ మేనేజర్‌ చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది.

కూరగాయల వ్యాపారులకు తీవ్ర నష్టం
పెద్దనోట్ల రద్దుపై అవగాహన లేక కూరగాయల వ్యాపారులు రోజులాగే పెట్టుబడి పెట్టి కూరగాయలు కొనుగోలు చేశారు. కానీ చిల్లర లేకపోవడంతో బుధవారం వ్యాపారం జరగలేదు. పచ్చిసరుకు ఏరోజుకారోజు విక్రయించాలి. లేదంటే కుళ్లిపోతాయి. ప్రజలు లేక కూరగాయల మార్కెట్‌ బోసి పోయింది. రోజూ మధ్యాహ్నాం 2గంటలకే పూర్తయ్యే కూరగాయల విక్రయాలు బుధవారం రాత్రి వరకూ కొనసాగాయి. రాత్రికి కూరగాయలు కుళ్లిపోతాయని, దీంతో తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు లబోదిబోమన్నారు.

భిక్షగాళ్లకు డిమాండ్‌
కొంతమంది చిల్లర కోసం తెలివిగా ఆలయాల సమీపంలోని భిక్షగాళ్లను ఆశ్రయించారు. రూ.500నోట్లు ఇస్తాం చిల్లర ఇవ్వండి అని అడగ్గానే పెద్దనోట్లు చెల్లవని తెలుసుకున్న భిక్షగాళ్లు 'అవసరం మీది...అవకాశం మాది'అన్నట్లు..రూ.500కు రూ.50–100 కమీషన్‌ డిమాండ్‌ చేశారు. చేసేదీ లేక కమీషన్‌ చెల్లించి చిల్లర తీసుకెళ్లారు.

మందుల దుకాణాల్లో ఇక్కట్లు
ఆస్పత్రులలో ఈనెల 11వరకూ పెద్దనోట్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటించినా చాలాచోట్ల ఇది అమలు కాలేదు.  ముఖ్యంగా మెడికల్‌ దుకాణాల్లో పెద్దనోట్లు తీసుకోలేదు. చిల్లర కావాలని అడిగారు. 800 బిల్లు అయితే రూ.500 నోట్లు తీసుకున్నారు. రూ.100కు మందులు కొనుగోలు చేసి రూ.500 ఇస్తే చిల్లర లేదని వెనక్కు పంపారు.

బోసిపోయిన బంగారు దుకాణాలు
బంగారు దుకాణాల్లో కూడా వ్యాపారం పూర్తిగా తగ్గింది. 15, 16 తేదీల్లో భారీగా వివాహాలు ఉన్నాయి. దీంతో మంగళవారం వరకు ఊపందుకున్న బంగారు కొనుగోళ్లు...  బుధవారం బోణికు కూడా నోచుకోలేకపోయాయి. నోట్ల రద్దుతో నగదు లేనివాళ్లు కొనుగోళ్లు చేయలేకపోయారు. ఈ క్యాష్‌ ఉన్నవారు కొనుగోలు చేశారు. దీనికి తోడు బుధవారం ఏకంగా 10గ్రాముల బంగారం రూ.1,400 పెరగడంతో కొనుగోలు దారులు వెనుకడుగు వేశారు. దీంతో ఖజానా, రితీ, స్టార్‌జ్యూవెలర్స్‌ లాంటి పెద్ద దుకాణాల్లో రోజువారితో పోలిస్తే వ్యాపారం బాగా తగ్గింది.

రైల్వేస్టేషన్లలోనూ తప్పని తిప్పలు
చిల్లర కోసం ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా రైల్వేస్టేషన్లలో క్యూ కట్టారు. పెద్దనోట్లు ఇచ్చి ధర్మవరం, గుత్తి టిక్కెట్టు ఇవ్వాలని అడిగారు. వచ్చిన చిల్లర తీసుకుని టిక్కెట్లు చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయారు. ఈ తాకిడితో ఉదయం 11గంటలకే కౌంటర్లలో చిల్లర అయిపోయింది. ఆపై రద్దీ అమాంతం పెరగడంతో నిజమైన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతా పెద్దనోట్లు ఇవ్వడంతో చిల్లర లేదని కౌంటర్‌లో తేల్చి చెప్పారు. చివరకు రైళ్లు రావడంతో ఏదైతే అది అవుతుందని టిక్కెట్టు లేకుండా రైలెక్కారు.

ఒక్క రిజిస్ట్రేషన్‌ లేదు
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, కమర్షియల్‌ట్యాక్స్, కార్పొరేషన్‌లో పన్నువసూళ్లు బుధవారం అమాంతం తగ్గాయి. రూ.కోట్లలో వసూలయ్యే డబ్బు బుధవారం వేలల్లోనే ముగిసింది. సోమ, మంగళవారాల్లో చలానా చెల్లించి రిజిస్ట్రేషన్లు మినహా బుధవారం ఒక్క చలానా చెల్లింపు జరిగి రిజిస్ట్రేషన్‌ జరగలేదు. పనిదినాల సమయంలో ఈ పరిస్థితి ఉండటం రిజిస్ట్రేషన్‌ చరిత్రలోనే ప్రథమం.

జీరో వ్యాపారుల గుండెల్లో దడ
అనంతపురంలో జీరోబిజినెస్‌ చేసే వ్యాపారులు భారీగా ఉన్నారు. వీరంతా కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు ముడుపులు చెల్లించి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారులు కూడా జీరోబిజినెస్‌ చేస్తున్నారు. వీరి వ్యాపారంలో బ్యాంక్‌ ద్వారా చెల్లింపులు ఉండవు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే చేస్తారు. ఇలాంటి వారి ఇళ్లలో రూ. లక్షలు, కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. నోట్ల రద్దుతో వీరంతా షాక్‌కు గురయ్యారు. నేటి నుంచి జరగబోయే నోట్ల మార్పిడిలో ఈ మొత్తం బ్యాంకుల్లో చూపిస్తే తర్వాత ఐటీ దాడులు తప్పవని భావిస్తున్నారు. దీంతో ఉన్న నగదును బ్యాంకులో మార్పిడి చేసి కొత్తనోట్లు ఎలా పొందాలనే ఆలోచనకు పదునుపెట్టారు.

రూ.వందకోట్ల లావాదేవీలు బంద్‌
జిల్లాలోని 33 ప్రిన్సిపల్‌ బ్యాంకులు, వాటి పరిధిలోని 400శాఖల్లో రోజూ రూ.వందకోట్ల మేర లావాదేవీలు జరిగాయి. బ్యాంకులకు సెలవు ప్రకటించడంతో రూ.వంద కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. నేటి నుంచి బ్యాంకులు పనిచేస్తాయి. చిల్లర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా దృష్ట్యా నేటి నుంచి ఆదివారం వరకూ సెలవుదినాల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకుల్లో వందనోట్లతో పాటు రూ.500, 2వేలనోట్లు చలామణిలోకి వస్తాయి. ప్రజల వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి కొత్త నోట్లు పొందవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement