కెనడాలో తెలుగు యువతి దారుణ హత్య | Cynthia Mullapudi, 24, An Indian young woman shot dead in Toronto, Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో తెలుగు యువతి దారుణ హత్య

Published Sun, May 1 2016 2:28 PM | Last Updated on Mon, Apr 8 2019 7:52 PM

కెనడాలో తెలుగు యువతి దారుణ హత్య - Sakshi

కెనడాలో తెలుగు యువతి దారుణ హత్య

టొరంటో: స్నేహితులతో కలిసి షాపింగ్ కు వెళ్లిన ఆ యువతి.. శవమై తిరిగొచ్చింది. ఒకరిని టార్గెట్ చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. కెనడా రాజధాని టొరంటోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో కింతియా జాన్ అనే తెలుగు యువతి దుండగుల తూటాలకు బలైంది. టొరంటో పోలీసులు, 'సాక్షి' సేకరించిన వివరాల ప్రకారం..

టొరంటోలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పుట్టిన కింతియా జాన్(24) పీజీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నలుగురు స్నేహితులతో షాపింగ్ కు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చేందుకు నలుగురు స్నేహితులు కారు ఎక్కుతుండగా.. ఒక్కసారిగా వాళ్లవైపు దూసుకొచ్చిన దుండగుడు తుపాకితో కాల్పులు జరిపాడు. కింతియా స్నేహితుడు, కెనడాకే చెందిన జోసెఫ్ ను టార్గెట్ చేసుకుని దుండగుడు కాల్పులు జరపగా.. అప్పటికే సీట్లో కూర్చున్న కింతియాకు కూడా బుల్లెట్లు తగిలాయి. కాల్పుల అనంతరం దుండగుడు మరొకడితో కలిసి సిల్వర్ కలర్ కారులో పారిపోయాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న కింతియా, జోసెఫ్ లను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందేలోపే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి దుండగుల టార్గెట్ జోసఫే అయిఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న మిగతా ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కింతియా జాన్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీ. ఆమె తండ్రి జాన్ కృపాకరం వృత్తిరీత్యా వైద్యుడు. తల్లి ఆలూరు శోభ ఉపాధ్యాయిని. 16 ఏళ్ల కిందటే వారు టొరంటో(కెనడా)కు వలస వెళ్లి స్థిరపడ్డారు. కింతియాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. కాగా, అంత్యక్రియలు టొరంటోలోనే నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కింతియా హత్యకు గురికావడంతో మహబూబ్ నగర్ లోని ఆమె బంధువుల ఇళ్లల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement