నరకప్రాయం గ్రామీణ రహదారులు
నరకప్రాయం గ్రామీణ రహదారులు
Published Sun, Jul 17 2016 11:34 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
అనుమసముద్రంపేట : గ్రామీణ రహదారులు వాహనచోదకులుకు నరకం చూపుతున్నాయి. మండలంలోని 19 పంచాయతీల పరిధిలో ఉన్న రోడ్లు గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయమై రాకపోకలు సాగించలేని విధంగా ఉన్నాయి.
మండలంలోని సీబీవరం నుంచి ఆత్మకూరు–వింజమూరు రోడ్డు బాగోలేకపోవడంతో ఈ మూడు కిలోమీటర్లున్న ఈ రహదారిపై వెళ్లాలంటే అరగంటకుపైగా సమయం పడుతుంది. దీంతో చాలామంది ప్రత్యామ్నాయంగా పొలాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కావలియడవల్లి నుంచి సంగం – కలిగిరి రోడ్డు వరకు, వేల్పుల గుంట నుంచి కలిగిరి – సంగం రోడ్డు వరకు ఉన్న రహదారులు రాళ్లు లేచి గుంతలు పడి ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. కావలియడవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న రెండు కల్వర్టులు రోడ్డు మధ్యలో కూలిపోయి రంధ్రాలు పడ్డాయి. దీంతో కొత్తగా ఆ ప్రాంతంలో తిరిగేవారు ప్రమాదాలకు గురవుతున్నారు.
మాటలకే పరిమితం :
గుంపర్లపాడు, అగ్బరాబాదు, కుప్పురుపాడు, కొండమీదకొండూరు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. గత సంవత్సరం నవంబరులో వచ్చిన తుపానుకు ముందు అరకొరగా ఉన్న గుంతలు తుపాను అనంతరం మరింత పెద్దవిగా మారాయి. ఏఎస్‌పేట నుంచి పందిపాడుకు వెళ్లే నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఆ సమయంలో తీవ్రంగా దెబ్బతింది. తుపాను అనంతరం రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికారులు సైతం నిధులు లేవనే సాకు చూపుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని వాహనచోదకులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం : శ్రీనివాసులు, ఏఈఈ, పీఆర్, ఏఎస్‌పేట
మండలంలోని గ్రామీణ రోడ్లు గత కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని విషయం వాస్తవమే. పలు పర్యాయాలు నివేదికలు పంపించాం. ఇటీవల రూ.1.8 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైతే పనులు చేపడుతాం.
Advertisement
Advertisement