స్టిక్కరింగ్ లేకుండా ప్రమాదకరంగా ఉన్న రహదారి
-
కానరాని రక్షణ చర్యలు
-
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ విమానాశ్రయం నుంచి కుక్కలగూడుర్ వరకు ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వన్‌వేగా ఉన్న ఈరహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు నిధులు మంజూరు కావడంతో రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కాంట్రాక్టర్ రహదారికి ఇరువైపులా దాదాపు రెండు మీటర్ల వెడల్పుతో ప్రొక్లెయిన్‌తో మట్టిని తొలగించే పనులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో రహదారిపై ఎలాంటి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కందకాలలో పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా రేడియంతో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. కనీసం మూల మలుపుల వద్ద కూడా ఎలాంటి హెచ్చరిక, రోడ్డు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో అయితే పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపేందుకు సైన్ బోర్డులతో పాటు రేడియంతో కూడిన స్టిక్కరింగ్ ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత కాంట్రాక్టర్ అలాంటి ఏర్పాట్లు చేయలేదు. నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈరహదారిపై ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారిపై సైన్‌బోర్డులు, రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.