డేంజర్..యమ డేంజర్
హైవేపై ఎల్లగిరి క్రాస్ రోడ్డు పేరు చెబితేనే వాహనదారుల వెన్నులో వణుకుపుడుతోంది.. ఇక్కడ రోడ్డు దాటాలంటేనే జంకుతున్నారు..ఇందుకు కారణం అతివేగంగా దూసుకొస్తున్న వాహనాలే. ఇప్పటి వరకు ఈ క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. జాతీయరహదారి విస్తరణలో భాగంగా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద భూదాన్ పోచంపల్లి వైపు వెళ్లే వాహనాల కోసం క్రాసింగ్ ఇచ్చారు. దానికి కొద్ది దూరంలోనే కొయ్యలగూడెం గ్రామం వద్ద అండర్ పాస్‌ను ఏర్పా టు చేశారు.
వాహనాలు బ్రిడ్జీ మీద నుంచే వెళ్తున్నాయి. ఇక్కడ నాలుగైదు కిలోమీటర్ల మేర హైవే దిగుడుగా, సీదాగా ఉండడంతో, వాహనాలు గంటకు 150కి.మీ.లకు మించిన వేగం తో దూసుకొస్తున్నాయి. దీంతో ఇక్కడ రోడ్డు దాటే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పది మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మరి కొందరైతే అవిటివాళ్లయ్యారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువకులు బైక్‌తో రోడ్డును దాటుతుండగా, అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో, గాలిలో బంతిలా ఎగిరొచ్చి, రోడ్డుకు రెండో వైపు పడ్డారు. అంటే వాహనాలు ఎంత వేగంతో పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గతంలోనూ ఈ మలుపు ప్రమాదకరమే..
హైవే విస్తరణ జరుగకముందు ఎల్లగిరి మూల మలుపు చాలా ప్రమాదకరమైనదే. ఇక్కడ రోడ్డు బాగా మలుపుగా ఉండేది. విస్తరణలో మూలమలుపును కొంత వరకు సరిచేయడంతో రోడ్డు ఏటవాలుగా మారడంతో వాహనాలు అతివేగంగా వస్తున్నాయి. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఒక్కోసారి 3నుంచి 7మంది వరకు చనిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది.
ఆందోళన చేస్తున్నా..
ఇక్కడ జరగుతున్న రోడ్డు ప్రమాదాలతో స్థానికులు అందోళన చెందుతున్నారు. జ నం చస్తున్నా జీఎంఆర్ అధికారులు నిర్లక్ష్య ం చేస్తున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు చేపట్టాలని ఆందోళనలు చేస్తు న్నా ఎవరూ స్పందించడం లేదు. క్రాసింగ్ ప్రమాదకరంగా ఉందని చెప్పేవారే కాని, పరిష్కారం చూపడం లేదు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఎల్లగిరికి చెం దిన ఇద్దరు చనిపోవడంతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గంటపాటు హైవేను స్థంభింపజేశారు. పోలీసులు గ్రామస్తుల మీద కేసు లు పెట్టారే తప్ప, మరేం చేయలేదు. క్రాసింగ్ వద్ద స్టాపర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
యాక్సిడెంట్ చేసిందా.. వాహనం దొరకనట్టే
హైవే విస్తరణ పనులు పూర్తికావడంతో వాహనాలు రయ్..రయ్‌మంటూ నాలుగులైన్ల రహదారిపై పరుగులు పెడుతున్నా యి. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఢీ కొట్టిన వాహనాలు కూడా దొరకలేదు. పోలీసుల కు ఫోన్ చేసే లోపే స్టేషన్ దాటి వెళ్లిపోతున్నాయి. స్థానికులు బైక్‌లతో వెంబడించి నా దొరకడం లేదు. మండలపరిధిలో జరిగిన ప్రమాదాల్లో 10కిపైగా వాహనాలు ఇలాగే ఢీ కొట్టి వెళ్లిపోయాయి. దీంతో బాధితులు నష్టపోతున్నారు. పోలీసులు ఏ వాహనంపై కేసు పెట్టాలో తెలియక తల మునకలవుతున్నారు. పలనా వాహనం ఢీ కొట్టిందని చెబుతున్నారే తప్పా, వాహనం నంబరు మాత్రం గుర్తించలేక పోతున్నారు. చివరకు కేసులను మూసేస్తున్నారు.
ఇక్కడ జరిగిన {పమాదాలు కొన్ని..
ఈ నెల 25న బైక్‌ను కారు ఢీ కొట్టడంతో, ఇదే గ్రామానికి చెందిన కొలుకులపల్లి లింగస్వామి(23), పోలేపల్లి గాలయ్య(36)లు అక్కడికక్కడే మృతిచెందారు.2012 నవంబర్ 2న, ఎల్లగిరి గ్రామానికి చెందిన కందగట్ల రాఘవరెడ్డి రోడ్డు దాటుతుండగా, కారు ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. కారు దొరకలేదు. 2012జూలై మాసంలో ఎల్లంబావి గ్రామానికి చెందిన ఈసం లక్ష్మమ్మ, కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వనం అంజయ్యలు రోడ్డు దాటుతుం డ గా, వేర్వేరు వాహనాలు ఢీ కొట్టడంతో మృతిచెందారు. ఢీ కొట్టిన వాహనాలు దొరకలేదు.
వారం రోజుల్లో సోలార్ సిగ్నల్ ఏర్పాటు
హైవేపై క్రాసింగ్ ఉన్నట్టుగా ఇరువైపులా సోలార్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయిస్తా. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడా. వారం రోజుల్లోగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయిస్తా. హోటళ్ల వద్ద, రోడ్డు వెంట వాహనాలు ఆగకుండా తగిన చర్యలు తీసుకుంటా.
-భూపతి గట్టుమల్లు, పోలీస్ ఇన్‌స్పెక్టర్, చౌటుప్పల్