దయాకర్ ఎన్నిక చెల్లదు
హైకోర్టులో సర్వే సత్యనారాయణ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరు దయాకర్ ఎన్నికను సవాలు చేస్తూ ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. దయాకర్ ఎన్నికను చెల్లనిదిగా నిర్ణయించి, వరంగల్ పార్లమెంట్ స్థానానికి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని సర్వే తన పిటిషన్‌లో కోరారు. ఇందులో దయాకర్‌తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.
ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసే నాటికి దయాకర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారని, ఆ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్లలో దయాకర్, అతని భార్య సంతకాలు చేశారని సర్వే పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు ప్రభుత్వంతో కాంట్రాక్టు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని ఆయన తెలిపారు. నామినేషన్ పత్రాల్లోని ఆస్తుల కాలమ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద రూ.1.49 లక్షలు అడ్వాన్స్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని, దీనిని బట్టి బీపీసీఎల్‌తో తను వ్యాపారం చేస్తున్నట్లు దయాకర్ స్వయంగా ఒప్పుకునట్లయిందన్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో కూడా దయాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని, అందులో భార్యను గృహిణిగా పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె బీపీసీఎల్ ఒప్పందంలో సంతకం చేశారని, రోహిణి గ్యాస్ ఏజెన్సీకి యజమాని కూడానన్నారు. వాస్తవాలను మరుగునపరిచి దయాకర్ సమర్పించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు.