రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి
హైదరాబాద్: వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కుమారుడు విశాల్‌రెడ్డి (18) బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఉదయం 8.15 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే చోట కొద్ది గంటల ముందే ఓ హౌజింగ్ కాంట్రాక్టర్ ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందడం గమనార్హం.
విశాల్‌రెడ్డి దోమలగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లి నీలిమ, సోదరితో కలసి నివాసం ఉంటున్నాడు. తండ్రి వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తరచూ వారి వద్దకు వచ్చి వెళుతుంటారు. విశాల్ తన సోదరికి చెందిన స్కూటీపై తరచూ బయటికి వెళుతుంటాడు. తరచుగా అక్క గోదారెడ్డి స్కూటి వాహనాన్ని తీసుకుని బయటకు వెళ్లేవాడు. బుధవారం ఉదయం స్కూటిపై ముషీరాబాద్‌లోని స్నేహితుడి వద్దకు వెళ్లిన విశాల్... తిరిగి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌వైపు వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. బస్సు వెనుక టైర్ అతని తలపై నుంచి వెళ్లడంతో.. అక్కడిక్కడే మృతి చెందాడు.
ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ రాంచందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విశాల్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాల్ తండ్రి రాజేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం వరంగల్‌కు తరలించారు.