యువకుని మృతదేహం లభ్యం
Published Fri, Aug 12 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
తాడేపల్లిగూడెం రూరల్ : ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన మారిశెట్టి గోవిందరావు (28) మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదేశాల మేరకు అధికారులు ఏలూరు కాలువలో ముమ్మరంగా గాలించారు. పడాల మార్కెట్ యార్డు సమీపంలో గురువారం గోవిందరావు మృతదేహాన్ని అగ్నిమాపకశాఖ సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మృతదేహానికి పంచనామా నిర్వహించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధి మిగిల్చిన విషాదం
స్నేహితులతో కలిసి తెలియని వ్యక్తి కర్మకాండలకు వెళ్లి విధి వంచించడంతో గోవిందరావు బలైపోయాడు. అందరికీ తలలో నాలుకలా ఉండే గోవిందరావు ఇక లేడనే విషయం కుటుంబ సభ్యులు, స్నేహితులకు మింగుడు పడటం లేదు. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన బిడ్డ ఇలా ఎర్ర నీటికి బలైపోతాడని అనుకోలేదని.. రేపో.. మాపో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో ఇలా చేసేవేంటి భగవంతుడా అంటూ తండ్రి సత్యనారాయణ బోరున విలపించారు. 12 రోజుల వ్యవధిలో ఇదే కాలువలో ఇద్దరు దుర్మరణం చెందడం పట్టణ ప్రజల్ని నిర్వేదానికి గురిచేస్తోంది.
Advertisement