రుణపాశం | debt hunter | Sakshi
Sakshi News home page

రుణపాశం

Published Wed, Mar 22 2017 10:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రుణపాశం - Sakshi

రుణపాశం

వడ్డీలేని రుణాలు మాటల్లోనే!
- 2014-15 నుంచి బడ్జెట్‌ కేటాయించని ప్రభుత్వం
- వడ్డీ, అపరాధ వడ్డీలతో రుణాలు వసూలు చేస్తున్న బ్యాంకులు
- జిల్లాకు వడ్డీలేని రుణాల బకాయి రూ.300 కోట్లపైనే
- కరువు రైతులపై కనికరం చూపని బాబు
 
వడ్డీ వదల్లేదు 
పంటల సాగుకు వెల్దుర్తి ఏపీజీబీలో 2015 ఖరీఫ్‌ సమయంలో రూ.70వేల రుణం తీసుకున్నా. ఎస్‌బీ అకౌంట్‌ నెంబర్‌.19060537239, లోన్‌ అకౌంట్‌ నెంబర్‌.91039623457. దీనికి వడ్డీలేని రుణం వర్తిస్తుంది. అయితే బ్యాంకు అధికారులు అసలుతో పాటు వడ్డీ వసూలు చేశారు. రూ.70 వేల పంట రుణానికి వడ్డీ రూ.15వేలు కలిపి రూ.85వేలు చెల్లించాం.
- వి.రాముడు, రైతు, బోగోలు, వెల్దుర్తి మండలం
 
కరువుతో రైతు పట్ల ప్రభుత్వం నుంచి కనీస సానుభూతి కరువయింది. 2014 ఎన్నికల్లో రైతులు, పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీపై ప్రభుత్వం మాట మార్చింది. రైతులకు అరకొరగా రుణాలు మాఫీ చేయగా.. పొదుపు మహిళలకు పూర్తిగా మొండిచెయ్యి చూపింది. చివరికి రైతులకు వడ్డీ లేని రుణాలనూ అమలు చేయకపోవడం గమనార్హం.
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరుస కరువు కాటకాలతో రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఇక బలవన్మరణాలు సరేసరి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వడ్డీలేని రుణాల అమలును పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. బడ్జెట్‌ విడుదల చేసి ఏ సంవత్సరం వడ్డీని అదే సంవత్సరం చెల్లిస్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. 2014 జూన్‌లో అధికారం చేపట్టిన టీడీపీ ఇప్పటి వరకు వడ్డీలేని రుణాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదంటే రైతుల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించి జిల్లాకు దాదాపు రూ.300కోట్లు వడ్డీలేని రుణాల అమలుకు విడుదల కావాల్సి ఉంది. ఈ మొత్తం విడుదలయితే ప్రతి రైతుకు రూ.30వేల వరకు ప్రయోజనం కలుగుతుంది. అయితే మూడేళ్లుగా ఆ ఊసే కరువయింది.
 
4శాతం వడ్డీ విడుదలలోనూ జాప్యం
ఒకవైపు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. పర్యటనలు, ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నా కష్ట కాలంలోని లక్షలాది రైతుల పంట రుణాలకు వడ్డీ విడుదల చేయడంలో ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. అన్ని బ్యాంకులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో రైతులకు పంట రుణాలు ఇస్తాయి. వీటికి 7శాతం వడ్డీ ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3శాతం భరిస్తుండగా.. వడ్డీలేని రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 4 శాతం భరించాలి. పంట రుణాలు సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే 3శాతం వడ్డీని ఇస్తుంది. మిగిలిన 4శాతాన్ని 2014-15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే రైతులు నిర్ణీత గడువులోపు అసలు చెల్లిస్తే సంబంధిత బ్యాంకు వడ్డీ కోసం ప్రభుత్వానికి క్లెయిమ్‌లు పంపుతాయి. ఆ ప్రకారం ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు విడుదల చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి.
 
అసలు, వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు
ప్రభుత్వం రైతుల పంట రుణాలకు వడ్డీలేని రుణాల అమలును పట్టించుకోకపోవడంతో  2015–16 నుంచే రైతుల నుంచి అసలు, వడ్డీ వసూలు చేస్తున్నాయి. సకాలంలో పంట రుణం చెల్లించలేదనే కారణంతో అపరాధ వడ్డీని వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం వడ్డీని విడుదల చేసినప్పుడు మీ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తాం... ముందు మీరు రుణాన్ని వడ్డీ సహా చెల్లించాల్సిందేనంటూ బ్యాంకులు బలవంతంగా వసూళ్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకులన్నీ 2014–15 నుంచి రుణాలను వడ్డీ సహా వసూలు చేస్తున్నాయి.
 
బకాయి రూ.300 కోట్లకు పైనే..
2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి వడ్డీలేని రుణాల అమలుకు బడ్జెట్‌ విడుదల చేయాలని బ్యాంకులు క్లయిమ్‌లను ప్రభుత్వానికి పంపాయి. ఈ రెండేళ్ల వడ్డీలేని రుణాల అమలుకే దాదాపు రూ.200 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కానందున క్లయిమ్‌లు పంపలేదు. ఈ ఏడాదికి సంబంధించి కనీసం రూ.100కోట్లు విడుదల కావాల్సి ఉంది. అంటే మొత్తంగా రూ.300 కోట్లు జిల్లాకు వడ్డీలేని రుణాల అమలుకు విడుదల చేయాల్సి ఉంది. ఒక్క జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకే వడ్డీలేని రుణాల అమలుకు 2015–16 సంవత్సరానికి మాత్రమే రూ.7 కోట్లు విడుదల చేయాల్సి ఉండటం గమనార్హం.
 
బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి క్లెయిమ్‌లు
గడువులోపు పంట రుణాలు చెల్లించిన రైతులందరికీ వడ్డీలేని రుణాలు లభించేలా అన్ని బ్యాంకులు ప్రభుత్వానికి క్లెయిమ్‌లు పంపుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేస్తే రైతుల బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తం జమ అవుతుంది. కొన్ని బ్యాంకులు రైతుల నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తుండగా.. మరికొన్ని అసలు మాత్రమే వసూలు చేసుకొని ప్రభుత్వానికి క్లెయిమ్‌లు పంపుతున్నాయి.
- నరసింహారావు, ఎల్‌డీఎం, కర్నూలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement