‘సూక్ష్మం’.. ఏదీ మోక్షం!
‘సూక్ష్మనీటి’పై అలక్ష్యం
♦ ఏటా తగ్గుతున్న లక్ష్యం
♦ డిమాండ్ ఉన్నా కుదింపు
♦ వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే
♦ ఉసూరుమంటున్న రైతులు
♦ సీఎం సొంత జిల్లాలోనే ఈ దుస్థితి
♦ నాబార్డు బడ్జెట్‌పైనే ఆశలు
♦ విస్మయం కలిగిస్తున్న అధికారుల తీరు
గజ్వేల్: బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యమివ్వాలని ఓవైపు సీఎం చెబుతున్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బిందు, తుంపర సేద్యానికి పరికరాలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది కూడా మంజూరు అంతగా లేదు. గతంతో పోలిస్తే టార్గెట్‌ను చాలావరకు తగ్గించారు. ఇప్పటికే వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా... కొత్త దరఖాస్తులకు మోక్షం లభించడం అనుమానమే. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది.భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్న ఈ జిల్లాలో సూక్ష్మనీటి పథకం అనివార్యంగా మారింది.
అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించడానికి ఈ పథకాన్ని రైతులు తరుణోపాయంగా భావిస్తున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, ఇతరులకు 90శాతం సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నారు. ఏ యేటికాయేడు ఈ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. కానీ రైతుల అవసరాలకనుగుణంగా ప్రభుత్వం పరికరాలను అందించలేకపోతోంది. రెండేళ్ల కిందట 6,500 హెక్టార్లలో డ్రిప్పు, మరో 3,500 హెక్టార్లలో తుంపర సేద్యం పరికరాలను అందజేశారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా మూడు వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి.
సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనూ సుమారు వెయ్యి వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గతేడాది కేవలం నాలుగు వేల హెక్టార్లలో డ్రిప్పు, 1,650 హెక్టార్లలో స్ప్రింక్లర్లను అందించడానికి కార్యాచరణ రూపొందించగా... బిందు సేద్యం పరికరాల విలువ రూ.43.02 కోట్లు, స్ప్రింక్లర్ల విలువ రూ.16.93 కోట్లు ఉంటుంది. సబ్సిడీని మినహాయిస్తే రెండు కలుపుకొని రూ.40 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతుండగా.... వాటిని కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోయారు.
తాజాగా డ్రిప్‌కు సంబంధించి 4,500 హెక్టార్లు, మరో 3,940 హెక్టార్లు స్ప్రింక్లర్లు అందించడానికి టార్గెట్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.50 కోట్ల బడ్జెట్ కూడా మంజూరైంది. నిజానికి గతేడాది మాదిరిగా 10 వేల హెక్టార్ల టార్గెట్‌ను పెట్టుకున్నా... రైతుల నుంచి డిమాండ్ వెల్లువలా వచ్చే అవకాశముందని అధికారులకు తెలిసినా కుదించడంలో ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. వాస్తవ పరిస్థితిని మరిచి ప్రణాళికలు తయారు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాబార్డు బడ్జెట్‌పైనే ఆశలు...
జిల్లాకు సుమారు రూ.198 కోట్ల బడ్జెట్ సూక్ష్మనీటి సేద్యపు పథకానికి మంజూరయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ విడుదల కాగానే ఎంతమంది రైతులు డ్రిప్, స్ప్రింక్లర్లు అడిగినా ఇచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు.