డిగ్రీ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రారంభించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. రెండు మూడు రోజుల్లో పొడిగింపు తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలపై రంజీవ్ ఆచార్య బుధవారం వివిధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెల్ప్‌లైన్ కేంద్రాల ఇన్‌చార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్ ప్రవేశాలను పక్కాగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసారి ప్రవేశాలకోసం అతితక్కువమంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కారణాలేంటని ఆచార్య ప్రశ్నించగా, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చాక ప్రవేశాలు పెరుగుతాయని, వారంతా దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించాలని ప్రిన్సిపాళ్లు కోరారు. ఇందుకు రంజీవ్ ఆచార్య ఆమోదం తెలిపారు. గురువారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
33 ప్రభుత్వ డిగ్రీ కాలే జీల భవనాలకు రూ. 74.25 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు (జీడీసీ) సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.74.25 కోట్లు మంజూరు చేసింది. అలాగే మెదక్ జిల్లా జోగిపేట్, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు, ఖమ్మం పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి 2.49 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఇవీ కొత్త భవనాలు నిర్మించే కాలేజీల వివరాలు
కరీంనగర్: జీడీసీ హుస్నాబాద్, గంభీరావుపేట, మహదేవ్‌పూర్, చొప్పదండి.
ఖమ్మం: జీడీసీ నేలకొండపల్లి, గార్ల.
వరంగల్: జీడీసీ భూపాలపల్లి, చేర్యాల,మరిపెడ
మహబూబ్‌నగర్: జీడీసీ ఆమ్రాబాద్, కొడంగల్, జీడీసీ (డబ్ల్యూ) నాగర్‌కర్నూల్, గద్వాల, జీడీసీ కొల్లాపూర్, షాద్‌నగర్, శాంతినగర్.
మెదక్: జీడీసీ (డబ్ల్యూ) సిద్దిపేట్, గజ్వేల్, జోగిపేట్, మెదక్, జీడీసీ పటాన్‌చెరు, నర్సాపూర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బుద్దెర.
నల్లగొండ: జీడీసీ ఆలేరు, హుజూర్‌నగర్.
నిజామాబాద్: జీడీసీ మోర్తాడ్, దర్పల్లి.
రంగారెడ్డి: జీడీసీ చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, తాండూరు, హయత్‌నగర్, విద్యానగర్.