ఆక్రమణల తొలగింపునకు మళ్లీ రంగం సిద్ధం
-
నేటి నుంచి ఆక్రమణల తొలగింపు
-
కసరత్తు ప్రారంభించిన మున్సిపల్ అధికారులు
-
భారీగా పోలీసులు మొహరించే అవకాశం
నెల్లూరు, సిటీ: నగరంలోని పంట కాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ రంగం సిద్ధం చేశారు. నగరంలోని రామిరెడ్డి కాలువ, గచ్చుకాలువ, సాహెబ్ కాలువలపై నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు.ఇప్పటికే కాలువలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, దుకాణాలకు నోటీసులు జారీ చేసి ఉన్నారు. గత నెల 8న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అయితే ఒక్క రోజు మాత్రం భారీ భవనాలను పాక్షికంగా తొలగించి, పేద ఇళ్లు కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వర ఆలయం సమీపంలో నివసించే పేదల ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ అడ్డుకున్నారు. పునరావాసం చూపకపోవడంపై కోర్టును ఆశ్రయించగా ఆక్రమణల తొలగింపును నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేసిన మున్సిపల్ అధికారులు మళ్లీ తొలగింపునకు కసరత్తు ప్రారంభించారు.
భారీ పోలీసు బందోబస్తు
ఆక్రమణల తొలగింపునకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆక్రమణలు తొలగించే ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఉమామహేశ్వరి ఆలయం వద్దే ఆక్రమణలు తొలగింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఏ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు చేపడుతారనేది గోప్యంగా ఉంచుతున్నారు.