ఎర్రవల్లి చౌరస్తాలో సాగుతున్న పాదయాత్ర
ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్
ఇటిక్యాల : జిల్లాల ఎంపికలో నడిగడ్డకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ అన్నారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో గద్వాల జమ్ములమ్మ నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నడిగడ్డ ప్రాంత ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలకు అనుకూలమైన ప్రాంతం గద్వాలనేనని అన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల కమిటీలకు ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలకులు సైతం గద్వాల జిల్లా చేయవచ్చని స్పష్టంగా తెలియజేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే చేపట్టిన ఆయుత చండీయాగం ఫలాలు రాష్ట్రానికి దక్కాలంటే జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇందుకోసం జోగుళాంబ అమ్మవారి పేరిట గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని పేర్కొన్నారు. రెండోరోజు పాదయాత్రలో ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి ఎర్రవల్లిచౌరస్తా నుంచి షేకుపల్లి, సాసనూలు, దువాసిపల్లి, ఆర్.గార్లపాడు గ్రామాల మీదుగా మానవపాడు మండలంలోకి ప్రవేశించారు. ఆర్.గార్లపాడులో మధ్యాహ్న భోజనం అనంతరం స్వల్ప విరామంతో మానవపాడు మండలంలోకి అడుగుపెట్టారు. పాదయాత్రకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.
మంగళవారం రాత్రి ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి టెక్నో స్కూల్‌లో పాదయాత్ర బృందం బస చేసింది. బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించే ముందు సరస్వతి స్కూల్‌లో స్థానిక మహిళలు డీకే అరుణకు కుంకుమ బొట్టు పెట్టి పాదయాత్రను ప్రారంభింపజేశారు. సరస్వతి స్కూల్‌లో పాదయాత్రకు ముందు ఎమ్మెల్యేలు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పాదయాత్రలో ప్రధాన అధికారి విజయ్‌కుమార్, గద్వాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మానవపాడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్షీ్మనారాయణరెడ్డి, ఆర్.గార్లపాడు సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, పెద్దదిన్నె మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, అనంతరెడ్డి, ఇటిక్యాల మాజీ జెడ్పీటీసీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.