టీడీపీలో ‘డెంగీ’ వార్‌ !! | dengue war in tdp | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘డెంగీ’ వార్‌ !!

Published Sun, Sep 18 2016 11:44 PM | Last Updated on Tue, Jun 4 2019 6:17 PM

dengue war in tdp

ఎమ్మెల్యే, మేయర్, కమిషషనర్‌కు కులపిచ్చి పట్టుకుందని ఎంపీ జేసీ ఆరోపణ
కార్పొరేషన్‌లో అవినీతిపై ఈ నెల 21న సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
జేసీవ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతుందన్న ఎమ్మెల్యే
బంధాలు, సంబంధాలపై జేసీ చేసిన వ్యాఖ్యలపై కూడా చౌదరి సెటైర్లు
జేసీకున్న బంధాలు, సంబంధాలు, సహచర్యాలు తనకు లేవని వ్యాఖ్యలు
అధికారపార్టీనేతల వైఖరిని తప్పుబడుతున్న జనం


తెలుగుదేశం పార్టీలో ‘డెంగీ’వార్‌ మొదలైంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ‘అనంత’లోని పాతూరులో డెంగీతో చిన్నారులు చనిపోయిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఇద్దరూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌పై జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. జేసీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే ఎమ్మెల్యే చౌదరి కూడా ఘాటుగానే  స్పందించారు. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయలబ్ధి కోసం వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని జనం మండిపడుతున్నారు.

వినాయక్‌నగర్‌లో ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగీతో ఈనెల 15న ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది. మతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి శనివారం వినాయక్‌నగర్‌ వెళ్లారు. వారిని పరామర్శించిన అనంతరం స్థానికులు పలు సమస్యలను ఎంపీ దష్టికి తీసుకొచ్చారు. మంచినీరు, అపరిశుభ్రత, మురికి కాలువలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీనికి జేసీ స్పందిస్తూ ‘నాకు చెబితే ఏం చేస్తాను! వాళ్లు చేయాలి. చేయలేదు. వాళ్ల వద్దకు వెళ్లి ధర్నాలు చేయండి’ అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఓట్లేసి గెలిపించిన ఎంపీనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లుగా మాట్లాడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ క్రమంలో తిరిగి ఆదివారం జేసీ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌పై తీవ్రంగా స్పందించారు. కులపిచ్చి, బంధుప్రీతితో కార్పొరేషన్‌ను అవినీతి కూపంగా మార్చారని ధ్వజమెత్తారు. డెంగీతో పిల్లలు చనిపోతుంటే కొందరు అవినీతి మత్తులో తూగుతున్నారని పరోక్షంగాపై ముగ్గురిపై ఆరోపణలు చేశారు. కార్పొరేషన్‌ అవినీతిపై ఆధారాలతో ఈనెల 21న ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. కులగజ్జి, బంధుప్రీతి, అవినీతి వ్యాఖ్యలు నగరంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పలురకాల చర్చలకు దారితీశాయి. ఓవైపు కార్పొరేషన్‌లోని అవినీతిని వాస్తవమే అని చర్చిస్తూనే, ఎంపీగా దివాకర్‌రెడ్డి రెండున్నరేళ్లలో ఎందుకు అవినీతిపై ఫిర్యాదు చేయలేదు. సమీక్షలు పెట్టుకోలేదని నిలదీస్తున్నారు. 

ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. జేసీ పేరు ఉచ్ఛరించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. కులం గురించి మాట్లాడేవారు ‘యద్భావం తద్భవతే’ అనేమాటను గుర్తుంచుకోవాలన్నారు. కార్పొరేషన్‌లో అవినీతి వాస్తవమేనని, విడతవారీగా దాన్ని రూపుమాపుతామన్నారు. అవినీతి రూపుమాపేందుకు స్వయంగా రంగంలోదిగానని చెబుతూ స్వరూపను పూర్తిగా డమ్మీని చేసేలా మాట్లాడారు. రాజకీయ నాయకుల్లో అవినీతి ఎక్కువగా ఉందని, కార్పొరేషన్‌ అవినీతిపై మాట్లాడుతున్నారని, ఒకవేలు ఎదుటు వ్యక్తిని చూపిస్తే మూడు వేళ్లు మనల్ని చూపిస్తాయని పరోక్షంగా జేసీ కూడా అవినీతిపరుడే అనే అంశాన్ని చౌదరి చెప్పకనే చెప్పారు. బంధాలు, సంబంధాల గురించి కూడా జేసీ మాట్లాడుతున్నారని...70 ఏళ్లు వయస్సున్న ఆయన తన జీవితంలో బంధాలు, సంబంధాలు..ఇంకేమైనా ఉన్నవాటి గురించి ఆయనకు బాగా తెలుసునని, లాంటి సహచర్యాలు ఆయనకు ఉన్నట్లుగా తనకు ఇప్పటి వరకూ లేవని సెటైర్లు వేశారు. జేసీ వ్యాఖ్యలు క్రమశిక్షణ ఉల్లంఘనకు కిందకు వస్తాయని, దీనిపై పార్టీ వివరణ కోరుతుందని పరోక్షంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అనేలా చౌదరి మాట్లాడారు.

అందరూ సర్వమంగళ మేళాలే!
చిన్నారుల చావుల అంశాన్ని రాజకీయం చేసే ఎంపీ, ఎమ్మెల్యే నగరంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్‌లో ప్రతీది అవినీతి మయమనేది అందరికీ తెలుసని, దీనిపై మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని, దీన్నిబట్టి చూస్తే అవినీతిలో అందరూ భాగస్వాములే అనుకోవల్సి వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్యం మంచినీళ్లు కూడా అందించలేని మేయర్, ఎమ్మెల్యే,...ఇలాంటి సమస్యలు చెబితే ‘నేనేం చేస్తా! వారినే అడగండి’ అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పే ఎంపీలు ఉండటం తమ దౌర్భాగ్యమని ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement