ఉపఎన్నిక కోసమే అభివృద్ధి మంత్రం
- ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
చెన్నూరు (శిరివెళ్ల ) : ఉప ఎన్నిక ఉన్నందున నంద్యాలలో అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, ఇంతవరకు లేని ప్రేమ నేడెందుకు వచ్చిందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం ఏ నియోజకవర్గంలో పర్యటించని విధంగా సీఎం నుంచి మంత్రుల వరకు నంద్యాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని అన్నారు. ఇంతవరకు ఏ పని చేయకున్నా నేడు మాత్రం ఆ పని, ఈపని అని మంత్రులు ఆకస్మకి పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం చెన్నూరులో సర్పంచ్ నాగభూషణం,కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ బీసీ నాయకుడు కుమ్మరి సంజీవరాయుడు నాయకత్వంలో 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి.
ఈ సందర్భంగా వారందరికీ గంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఆయనను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాలకు 1300 ఇళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నవారు ఇప్పటి వరకు ఎంతమందికి మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శిల్పా నంద్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, నేడు అభివృద్ధి అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు.
ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు
విజయవాడ– గుంటూరులో జరగనున్న పార్టీ ప్లీనరీకి నియోజకవర్గం నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నామని గంగుల చెప్పారు. నియోజక, మండల, గ్రామ నాయకులు, జెడ్పిటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంధం రాఘవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నజీర్, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు బసాపురం సలాం, ఎంపీటీసీ నరహరి, మాజీ సర్పంచులు కమ్మా సుబ్బరాయుడు, జింకల నాగన్న, నరసింహ్మరెడ్డి, సదాశివారెడ్డి, ఇందూరి ప్రతాపరెడ్డి, ప్రతాపరెడ్డి, చౌదరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.