రాజధాని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు (ఫైల్)
అదిగో అమరావతి.. అంతా అధోగతి
Published Sat, Oct 22 2016 5:11 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి
* అవసాన దశలోనే రాజధాని పల్లెలు
* ప్రగల్భాలు ఘనం.. అభివృద్ధి శూన్యం
* ఇదేనా రాజధాని ప్ర‘గతి’
* వెలగపూడి మినహా వెలిగిందేమీ లేదు
ఆంధ్రుల కలల సౌధం అమరావతి అభివృద్ధి కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. పచ్చదనం కరువైన పల్లెలు.. మరుగున పడిన రోడ్లు.. అస్తవ్యస్త పారిశుధ్యం.. అవధుల్లేని పేదరికం.. అన్నదాతల ఆకలి వేదనతో రాజధాని ప్రాంతం నేడు అట్టడుగు స్థాయికి చేరింది. అదిగో సింగపూర్.. ఇదిగో కలల ప్రపంచం.. అని మభ్యపెట్టి రైతుల వద్ద నుంచి భూములు గుంజిన పాలకులు వెలగపూడిలో సచివాలయ నిర్మాణం తప్ప వెలగబెట్టిందేమీ లేదు. రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధిని బేరీజు వేస్తూ ‘సాక్షి’ పరిశీలన
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి రెండేళ్లయ్యింది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది అయ్యింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం మినహా మరెక్కడా అభివృద్ధి కనిపించలేదు. రాజధాని కోసం సమీకరించిన వేల ఎకరాల్లో ముళ్లచెట్లే దర్శనమిస్తున్నాయి. ఆ భూములను కూడా అక్రమార్కులు ముక్కముక్కలుగా చేసి మింగేస్తున్నారు. పోనీ.. గ్రామాలైనా అభివృద్ధయ్యాయా? అంటే మొండిగోడలతో మురికివాడలను తలపిస్తున్నాయి. పంటలు లేక... కౌలు రాక.. కూలీలకు పెన్షన్ అందక.. అల్లాడిపోతున్నారు. 2015 మేలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించగా, శంకుస్థాపన చేసి దసరాకు ఏడాదైంది. ఈ కాలంలో రాజధానిలో అద్భుతాలేవీ జరక్కపోగా, సగటు మనిషి జీవనం అంతంతమాత్రంగా మారింది. అన్నంపెట్టే భూమిని కోల్పోయిన రైతు.. పనుల్లేక కూలీలు.. ఉపాధి లేక యువత.. ఆసరాలేక పేదలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళగిరి, తాండికొండ నియోజకవర్గాల పరిధిలో 29 గ్రామాల్లో సుమారు 33వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ ద్వారా రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములిస్తే జీవితాలు మారిపోతాయని, గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి.
గుక్కెడు నీరూ కరువే..
రాజధాని గ్రామాల్లో మంచినీటికీ దిక్కులేదు. ఉన్న మంచినీటి గుంతలను కూడా బాగుచేసే వారు కరువయ్యారు. నిధులు లేక మురికి గుంత నుంచి వచ్చే నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఐనవోలు. ఈ గ్రామంలో మంచినీటి చెరువు ఉన్నా.. క్లోరినేషన్‌కు నిధులు లేవు. దీంతో ఆ నీటినే చిన్నపాటి ట్యాంక్‌కు పంపింగ్ చేస్తారు. ఆ నీరే గ్రామం మొత్తానికి దిక్కు. పైపులైన్లు పగిలిపోవడంతో వచ్చే నీరు కూడా వీధుల్లో వృథాగా పోతోంది. నేలపాడు, శాఖమూరు, పెద్దపరిమి, మందడం గ్రామాల ప్రజలు మంచినీరు లేక రోజూ రూ.20 వెచ్చించి వాటర్ క్యాన్ కొంటున్నారు. ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభించినా.. ఏ ఒక్క గ్రామంలోనూ కనిపించలేదు.
కౌలుతో పాట్లు..
ఎకరాకు పదిసెంట్ల చొప్పున తగ్గిస్తుండటంతో రైతులకు పరిహారం కింద ఇచ్చే ప్లాట్లు, కౌలులోనూ కోత పెడుతున్నారు. రైతులకు చెందాల్సిన ప్లాట్లు, కౌలు కొందరు అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారు. ల్యాండ్‌పూలింగ్ ద్వారా ఎకరం పొలం ఇచ్చిన రైతులకు ఏడాదికి కౌలు కింద రూ.30వేల నుంచి రూ.50వేలు చెల్లించాలి. ఏటా పదిశాతం పెంచాలి. కొందరు అక్రమార్కులు కౌలును దారి మళ్లిస్తున్నారు. కాగా, అసైన్డ్ భూములకు ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం గమనార్హం.
పింఛనో రామ‘చంద్రా..’
రాజధానిలోని వ్యవసాయ భూములపై సుమారు 63వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 50వేలకు పైగా కూలీలు ఉన్నారు. రోజూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవించేవారు. ప్రస్తుతం సాగు నిలిచిపోవడంతో కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. భూములు తీసుకునే సమయంలో కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, కేవలం 12 ప్రాంతాల్లో నర్సరీలు పెట్టి పదుల సంఖ్యలో ఉపాధి చూపించి చేతులు దులుపుకొన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే కూలీలకు నెలనెలా రూ.2,500 పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా మొదట 38వేల మంది కూలీలను గుర్తించింది. ఆ తరువాత రకరకాల కారణాలతోl20వేల మందికి కుదించింది. వారికి కూడా నెలనెలా పెన్షన్ ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక.. పెన్షన్ రాక అనేక మంది కూలీలు విజయవాడ, గుంటూరుకు వెళ్తున్నారు.
ఉచిత విద్య.. వైద్యం ఊసేది?
భూములిచ్చిన గ్రామాల్లో నివసిస్తున్న రైతు, కూలి కుటుంబాల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు అది అమలుకాలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి కింద అర్హుడైన ప్రతి యువకుడికీ రూ.2 వేలు ఇస్తామని వెల్లడించారు. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు.. భృతీ ఇవ్వలేదు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు..
తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయించి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అనంతవరంలోని భూమి రికార్డుల్లో మాయం కావడాన్ని ప్రశ్నించిన రైతులపై దాడిచేయడంతో పాటు ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
పడకేసిన పారిశుధ్యం..
స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామన్న పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. తుళ్లూరు, ఐనవోలు, నేలపాడు, మల్కాపురం, నెక్కల్లు, వడ్డెమాను, పెద్దపరిమి తదితర గ్రామాల్లో మురికి కాలువలు లేవు. దీంతో నివాసాల్లోని వ్యర్థాలు వీధుల్లో ప్రవహిస్తున్నాయి. వర్షం వస్తే ఎక్కడి నీరు అక్కడే. ఈ నీటితో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు స్వైర విహారం చేయడంతో పల్లె జనం రోగాల బారిన పడుతున్నారు.
Advertisement
Advertisement