పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి
కోవూరు: పరిశ్రమలు ఏర్పడితేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేలాయుధం తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కోవూరు నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నూతన పారిశ్రామికవేత్తలతో పాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో బొడ్డువారిపాళెంలో 48 ఎకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించామని వివరించారు. ఆరీఫ్ సంస్థ సహకారంతో మహిళలను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల పెట్టుబడుల్లో 35 నుంచి 45 శాతం వరకు రాయితీ ఇవ్వడమే కాకుండా నూరుశాతం సేల్స్ టాక్స్ రాయితీని ఇస్తుందన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పావలా వడ్డీతో పాటు విద్యుత్ రాయితీని కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా 2015 పరిశ్రమల ప్రణాళికను రూపొందించామన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సింగిల్ డెస్క్ విధానంలో మంజూరుచేసేలా చర్యలు తీసుకుటున్నామన్నారు. పరిశ్రమల అనుమతికి దరఖాస్తు చేసుకొన్న 21 రోజుల్లో అనుమతిని మంజూరు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమల శాఖ ఏడీ సురేష్, ఏపీఐఏసీ మేనేజర్ మునిరత్నం, బీమ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్‌బాబు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ సుబ్బరాయులు, పరిశ్రమలశాఖ ఐపీఓలు ప్రసాద్, ఫణికుమార్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.