‘హోదా’ అడగనే లేదు!
చంద్రబాబు ఆ డిమాండే చేయలేదు: బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్
♦ చట్టంలో ఉన్నవే అమలు చేయాలని కోరారు
♦ ఏపీకి హోదా ఇవ్వలేం.. ప్రత్యేక రాష్ట్రంగా చూస్తాం
♦ రెవెన్యూ లోటు భర్తీ చట్టంలో లేకపోయినా ఇస్తున్నాం
♦ పోలవరం పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే
♦ కేంద్రం నిధులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరి బట్టబయలైంది. సీఎం ఇంతవరకూ కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోరనేలేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో సిద్ధార్థనాథ్ నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం నగరంలోని ఒక హోటల్‌లో సిద్ధార్థనాథ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా విషయంపై మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఏం ఉందో దాన్ని అమలు చేయమని చంద్రబాబు కోరారని, అదే తాము చేస్తున్నామని తెలిపారు.
అంటే చంద్రబాబు ప్రత్యేక హోదా కోరలేదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తారు’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక కేటగిరి స్టేటస్ ఇవ్వలేము కానీ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో ప్రత్యేకంగా చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, 12వ రాష్ర్టంగా ఏపీని చూపలేక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
14వ ఆర్థిక సంఘం ద్వారా అదనపు నిధులు..
ఏపీకి తప్పనిసరిగా రెవెన్యూ లోటు భర్తీచేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని, అయినా ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ప్రతియేటా రెవెన్యూ లోటు కింద నిధులు ఇస్తున్నారని అన్నారు. కేంద్రం ఏపీకి నాలుగేళ్లలో రూ. 22,112 కోట్లు రెవెన్యూ లోటు కింద ఇస్తుందని, దీనిలో ఇప్పటికే రూ. 7,020 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 13వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి రూ. 1,70,686 కోట్లు రాగా, 14వ ఆర్థిక సంఘంలో రూ. 2,06,911 కోట్లు వస్తున్నాయని, అంటే రూ. 30 వేల కోట్లు ఎక్కువగా వస్తుందని వివరించారు. ఇవికాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 1.43 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానికి నూరుశాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వివరించారు.
ఇంతచేస్తున్నా బీజేపీ, కేంద్రప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నేతల్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కేంద్రం ఇస్తున్న నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఐదుగురు సభ్యులుంటారని చెప్పారు. వాళ్లు మంత్రిత్వశాఖలను సంప్రదించి ప్రాజెక్టుల పురోగతిని ప్రజలకు చెబుతారని అన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. జూన్‌లో విజయవాడలోనే మరోమారు బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి అమిత్ షా వస్తారని, అమిత్ షా ర్యాలీ కూడా ఉంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు, పార్టీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.