పత్తి బోక్తలపై క్రమశిక్షణ చర్యలు
Published Mon, Nov 21 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
- సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాల ప్రభావం
- సహకరించిన మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది
- ఇది వరకే ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
- తాజాగా మరో 14 మందికి చార్జీమెమోలు
కర్నూలు(అగ్రికల్చర్): పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి జిల్లాలోని వివిధ మార్కెట్ కమిటీలకు చెందిన వివిధ స్థాయిల అధికారులు, సిబ్బందికి మార్కెటింగ్ శాఖ కమిషనర్ చార్జిమెమోలు జారీ చేశారు. ఇందులో ముగ్గురు అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం వీరితోసహా 17 మందికి చార్జిమెమోలు జారీ అయ్యాయి. 2014లో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాలో 8 పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఏర్పాటు చేసింది. మార్కెట్ కమిటీ కార్యదర్శులు మొదలు గ్రేడర్ వరకు కొనుగోళ్లను పర్యవేక్షించారు. అయితే రైతుల నుంచి మాత్రమే పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా సీసీఐ ప్రతినిధులు, మార్కెట్ కమిటీల అధికారులు, సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కై రైతు ప్రయోజనాలకు గండికొట్టారు. ఇందులో స్థాయిని బట్టి అందరికీ మామూళ్ల ముట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు తవ్వితీయగా వారి నివేదికల ఆధారంగా అక్రమార్కులపై మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. అప్పట్లో నంద్యాల మార్కెట్ కమిటీ సెక్రటరీగా పనిచేసి తర్వాత రాయలసీమ మార్కెటింగ్ శాఖ డీడీఎంగా బదిలీ అయిన వెంకటసుబ్బన్న, అప్పుడు కోవెలకుంట్ల మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, పత్తికొండ సూపర్‌వైజర్ మదన్‌మోహన్‌రెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. తాజాగా వీరితో పాటు మరో 14 మందికి చార్జీమెమోలు జారీ చేసింది.
చార్జీమెమోలు పొందిన వారి వివరాలు..
ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ రామారావు, సూపర్‌వైజర్ శాంతకుమార్, గ్రేడర్ పద్మరాజు, నంద్యాల మార్కెట్ సూపర్‌వైజర్ వెంకటేశ్వర్లు, గ్రేడర్ సురేష్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ యాసిన్ (ప్రస్తుతం అక్కడ లేరు), గ్రేడర్ జ్ఞానప్ప, గ్రేడ్–3 సెక్రటరీ ఉమాపతిరెడ్డి, సూపర్‌వైజర్ కృష్ణుడు, డోన్ మార్కెట్ కమిటీ సెక్రటరీ నాగన్న, ఎమ్మిగనూరు మార్కెట్ సూపర్‌వైజర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు మార్కెట్ సెక్రటరీ చంద్రమోహన్‌రెడ్డి, ఆలూరు మార్కెట్ సూపర్‌వైజర్ శ్రీనివాసరావు,, నందికొట్కూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి(పస్తుతం ఎమ్మిగనూరు)కి చార్జిమెమోలు జారీ అయ్యాయి.
Advertisement
Advertisement